![Gold Price Today: 10 Grams of 24 Carat priced at RS 52230, Silver at RS 68837 per kilo - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/10/gold-jewellery.jpg.webp?itok=wBuojfoJ)
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్'కు 0.8% తగ్గి $1,975.69కు పడిపోయింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.5% తగ్గి 1,978.80 డాలర్లకు చేరుకుంది.
ప్రపంచ రేట్లకు అనుగుణంగా భారతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఒక్కరోజులో సుమారు రూ.2,000కి పైగా పడిపోవడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.2050కి పైగా తగ్గి రూ.52,230కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.49,723 నుంచి రూ.47,843కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.49,800 నుంచి రూ.48,200కు తగ్గింది. అంటే ఒక్కరోజులో రూ.1600 తగ్గింది అన్నమాట.
ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.52,580కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండి ధర రూ.3,000కి పైగా తగ్గి రూ.68,837కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. పసిడి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అనే విషయం గుర్తుంచుకోవాలి.
#Gold and #Silver Opening #Rates for 10/03/2022#IBJA pic.twitter.com/coh4GaBHax
— IBJA (@IBJA1919) March 10, 2022
(చదవండి: టాటా మోటార్స్ బంపరాఫర్.. ఈ కార్లపై భారీ తగ్గింపు)
Comments
Please login to add a commentAdd a comment