సాక్షి, ముంబై: పెళ్లిళ్ల ముహూర్తాల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి కాలంలో ఒత్తిడినెదుర్కొంటున్న పుత్తడి ధరలు మూడు నెలల కనిష్టానికి చేరాయి. బుధవారం నాటి మార్కెట్‌లో పసిడి ఫ్లాట్‌గా కొనసాగుతున్నప్పటికీ 2016 తరువాత భారీగా ధర పడిపోయిన నెల ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెలలో 10గ్రాముల బంగారం ధర 7.6 శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 3.2 శాతం ఎగిసింది. గత ఏడాది రూ. 56200 గరిష్టం నుంచి 10వేల రూపాయలు పడిపోయింది. ఇక ఈ నెలలోనే 2,700 రూపాయలు దిగి వచ్చింది.
ఎంసీఎక్స్‌లో ఆగస్టు బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాముల 46,518 రూపాయలు పలుకుతోంది. వెండి కిలోకు 0.16 శాతం పుంజుకుని రూ. 68381 వద్ద ట్రేడ్ అవుతోంది. రూ. 47600 వద్ద ప్రతిఘటనను ఉంటుందని, 46 వేల వద్ద కీలక మద్దతు స్థాయి అని విశ్లేషకులంటున్నారు. సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలోకు రూ .68,340 వద్ద, రూ .66 లేదా 0.10 శాతం పెరిగి, అంతకుముందు కిలోకు రూ .68,274 వద్ద ముగిసింది. రీటైల్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46770గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45180గా ఉంది. ఇక దేశీయంగా వెండి ధర కిలో రూ. 67747 పలుకుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో, బంగారు రేటు ఔన్సుకు 1,763.63 డాలర్లకు చేరుకుంది. అంటే, నాలుగు సంవత్సరాలలో ఇదే అతిపెద్ద నెలవారీ పతనం. అయితే వెండి స్వల్ప లాభాలను ఆర్జిస్తోంది. వెండి ఔన్స్ 0.3శాతం పెరిగి 25.82 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3శాతం పెరిగి 1,070.38 డాలర్లకు చేరుకుంది. ఊహించిన దానికంటే ముందుగానే యూఎస్ ఫెడ్ వచ్చే ఏడాది నుంచి వడ్డీరేట్ల పెంపు అంచనాలు, డాలర్ పుంజుకోవడమే దీని కారణమని భావిస్తున్నారు.
అలాగే అమెరికా కార్మిక విభాగం శుక్రవారం విడుదల చేయనున్నఉద్యోగాల నివేదిక కీలకమని, ఊహించిన దానికంటే ఘోరంగా ఈ గణాంకాలుంటే భవిష్యత్తులో మరింత ఒత్తిడి తప్పదని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment