
సామాన్యుడికి దూరమైన స్వర్ణం
ముంబై : యల్లోమెటల్ ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ గురువారం పసిడి ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 292 రూపాయలు పెరిగి 50,340 రూపాయలు పలికింది. కిలో వెండి 775 రూపాయలు భారమై 61,194 రూపాయలకు ఎగబాకింది. చదవండి : అటూఇటుగా.. పసిడి, వెండి ధరలు
ఇక దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల బంగారం 82 రూపాయలు పెరిగి 51,153 రూపాయలు పలికిందని, కిలో వెండి ఏకంగా 1074 రూపాయలు భారమై 61,085 రూపాయలకు చేరిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ (కమాడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ 1891 డాలర్లకు ఎగబాకిందని, డాలర్ ఒడిదుడుకులతో పాటు ఉద్దీపన ప్యాకేజ్, ఆర్థిక వ్యవస్థ రికవరీపై అస్పష్టతతో బంగారం ధరలు పెరిగాయని తపన్ పటేల్ విశ్లేషించారు.