
రూపాయి క్షీణతతో బంగారం ధరలు భారం
ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగివచ్చినా దేశీ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధరలు భారమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడంతో బంగారం ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 170 రూపాయలు పెరిగి 50,795 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 117 రూపాయలు భారమై 62,058 రూపాయలకు ఎగబాకింది.
ఇక రూపాయి క్షీణించడంతో దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల బంగారం 454 రూపాయలు పెరిగి 51,789 రూపాయలకు చేరుకోగా వెండి ధర 751 రూపాయలు భారమై 63,127 రూపాయలు పలికిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమాడిటీస్) తపన్ పటేల్ పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 1910 డాలర్లకు తగ్గాయి. కరోనా వైరస్ తీవ్రత, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభిస్తుండటంతో బంగారం ధరలు మరికొన్ని రోజులు ఒడిదుడుకులకు లోనవుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.