
ముంబై : కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు వైరస్ బారినపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు భారమయ్యాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1913 డాలర్లకు ఎగబాకడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఎగిశాయి. భారత్‌లో పదిగ్రాముల బంగారం 536 రూపాయలు పెరిగి 50940 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి ఏకంగా 981 రూపాయలు భారమై 60,900 రూపాయలకు చేరింది. కోవిడ్-19 సంక్షోభంతో పలు దేశాలు ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించడంతో ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్ధాయిలో పెరిగాయి.
ఆగస్ట్‌లో ఆల్‌టైం హైకి చేరిన అనంతరం పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. డాలర్ బలోపేతం కావడంతో పాటు ఆర్థిక వ్యవస్ధలో రికవరీ మొదలవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పసిడి ధరలు దిగివస్తున్న క్రమంలో తిరిగి బంగారం భారం కావడం యల్లోమెటల్‌ను సామాన్యుడికి దూరం చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు నెలకొన‍్న అనిశ్చితితో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.