న్యూయార్క్/ ముంబై: వరుసగా రెండో రోజు దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, బంగారం ధరలు జోరు చూపుతున్నాయి. వారాంతాన పసిడి ధరలు ఐదు నెలల కనిష్టాన్ని తాకడంతో మంగళవారం ఉన్నట్టుండి బంగారం, వెండి ధరలు జంప్‌చేశాయి. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ వెండి 5 శాతం దూసుకెళ్లగా.. పసిడి 2 శాతం ఎగసింది. వెరసి మంగళవారం పసిడి 200 రోజుల చలన సగటు 1800 డాలర్లను అధిగమించినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సాంకేతికంగా చూస్తే స్వల్ప కాలంలో మరింత బలపడే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఒకవేళ బలహీనపడితే 1756 డాలర్ల వద్ద బంగారానికి సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు.
కారణాలివీ
ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండున్నరేళ్ల కనిష్టం 91.32కు చేరడం, సెకండ్‌వేవ్‌లో భాగంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉండటం వంటి అంశాలతో తాజాగా పసిడికి డిమాండ్ కనిపిస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు.. ఇటీవల బంగారం డెరివేటివ్ మార్కెట్లో భారీ అమ్మకాలు చేపట్టిన ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలు చేపట్టడం ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశాయి. దీంతో దేశీయంగానూ ముందురోజు బంగారం, వెండి ధరలు భారీగా లాభపడ్డాయి. ఈ బాటలో ప్రస్తుతం మరోసారి ఇటు ఎంసీఎక్స్‌లోనూ.. అటు విదేశీ మార్కెట్లనూ హుషారుగా కదులుతున్నాయి. నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా..
లాభాలతో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 424 పెరిగి రూ. 48,699 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,699 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 48,400 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 631 బలపడి రూ. 62,549 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,019 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,425 వరకూ వెనకడుగు వేసింది.
సానుకూలంగా..
న్యూయార్క్ కామెక్స్‌లో మంగళవారం జంప్‌చేసిన బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.4 శాతం పుంజుకుని 1,826 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం లాభంతో 1,825 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 0.65 శాతం ఎగసి ఔన్స్ 24.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment