
గురువారం ఉన్నట్టుండి పతనమైన బంగారం, వెండి.. ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో కదులుతున్నాయి. గురువారం దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 228 పెరిగి రూ. 51,130 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 690 పుంజుకుని రూ. 65,880 వద్ద కదులుతోంది. ఈ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. మూడు వారాలుగా పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే.
గురువారమిలా
ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల పసిడి రూ. 877 కోల్పోయి రూ. 50,902 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52,160 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,533 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 2,339 దిగజారి రూ. 65,190 వద్ద నిలిచింది. ఒక దశలో 67,826 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 64,613 వరకూ పతనమైంది.
కామెక్స్‌లో..
న్యూయార్క్ కామెక్స్‌లో గురువారం 1,932 డాలర్లకు క్షీణించిన ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.7 శాతం పుంజుకుని 1,946 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1929 డాలర్లకు పతనమైన బంగారం తాజాగా 0.5 శాతం బలపడి 1939 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం 1 శాతం ఎగసి ఔన్స్ 27.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment