
వరుసగా రెండో రోజు బంగారం, వెండి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో కదులుతున్నాయి. ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే ప్రాధాన్యమివ్వనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పేర్కొనడంతో వారాంతాన బంగారం, వెండి ధరలు 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. వడ్డీ రేట్లను దీర్ఘకాలంపాటు నామమాత్ర స్థాయిలోనే అమలు చేయనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలివ్వడంతో డాలరు బలహీనపడింది. దీంతో ద్రవ్యోల్బణం, కరెన్సీ బలహీనతలకు హెడ్జింగ్‌గా వినియోగపడే పసిడికి డిమాండ్ పెరిగినట్లు ఆర్థిక నిపుణులు తెలియజేశారు. చౌక వడ్డీ రేట్లు బంగారంలో కొనుగోళ్లకు మద్దతుగా నిలిచే సంగతి తెలిసిందే.
రెండో రోజూ
శుక్రవారంనాటి జోరును కొనసాగిస్తూ బంగారం, వెండి.. ధరలు మళ్లీ మెరుస్తున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 190 బలపడి రూ. 51,638 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,261 ఎగసి రూ. 67,237 వద్ద కదులుతోంది.
వారాంతాన ప్లస్‌లో
గురువారం పతనం తదుపరి ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల పసిడి రూ. 546 పెరిగి రూ. 51,448 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 51,750 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,890 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 786 పుంజుకుని రూ. 65,976 వద్ద నిలిచింది. ఒక దశలో 66,660 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 65,268 వరకూ క్షీణించింది. అయితే ఈ నెల 7న నమోదైన గరిష్టం రూ. 56,200తో పోలిస్తే.. పసిడి రూ. 5,000 క్షీణించడం గమనార్హం!
కామెక్స్‌లోనూ..
న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం ప్రస్తుతం 0.2 శాతం పుంజుకుని 1,979 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం బలపడి 1970 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం 1 శాతం ఎగసి ఔన్స్ 28.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
శుక్రవారం అప్
శుక్రవారం ఔన్స్ పసిడి 42 డాలర్లు(2.2 శాతం) జంప్‌చేసి 1,975 డాలర్ల వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లోనూ 35 డాలర్లు(1.8 శాతం) ఎగసి 1964 డాలర్ల వద్ద నిలిచింది. ఇక వెండి సైతం 2.2 శాతం పురోగమించి ఔన్స్ 27.79 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. మూడు వారాలుగా పసిడి, వెండి ధరలు ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment