
విదేశీ మార్కెట్లో బుధవారం రెండు నెలల కనిష్టాన్ని తాకిన పసిడి, వెండి ధరలు గురువారం చివర్లో రికవర్ అయ్యాయి. అయితే దేశ, విదేశీ మార్కెట్లలో ప్రస్తుతం అటూఇటు(ఫ్లాట్)గా ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి(94.4) బలపడటం వంటి అంశాలు గత రెండు రోజుల్లో పసిడి, వెండి ధరలను దెబ్బతీశాయి. దీంతో న్యూయార్క్ కామెక్స్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ పసిడి జులై తదుపరి 1856 డాలర్లకు నీరసించిన సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం..
స్వల్ప నష్టాలతో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 71 క్షీణించి రూ. 49,833 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 129 నష్టంతో రూ. 59,500 వద్ద కదులుతోంది.
చివరికి లాభాల్లో..
ఎంసీఎక్స్‌లో ఆటుపోట్ల మధ్య గురువారం బంగారం, వెండి ధరలు చివరికి లాభపడ్డాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 396 బలపడి రూ. 49,904 వద్ద ముగిసింది. తొలుత 50,050 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,248 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 1,141 ఎగసి రూ. 59,629 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 59,847 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 56,020 వరకూ నీరసించింది.
స్వల్ప లాభాలతో
న్యూయార్క్ కామెక్స్‌లో గురువారం హెచ్చుతగ్గుల మధ్య స్వల్పంగా బలపడిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం అటూఇటుగా కదులుతున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర నష్టంతో 1876 డాలర్లకు చేరగా.. స్పాట్ మార్కెట్లో 0.25 శాతం పుంజుకుని 1872 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ఔన్స్ 0.7 శాతం ఎగసి 23.35 డాలర్ల వద్ద కదులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment