
తొలి సెషన్‌లో రెండు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన పసిడి, వెండి ధరలు అంతలోనే డీలాపడ్డాయి. ట్రేడర్లు అమ్మకాలకు ఎగబడటంతో తిరిగి దేశ, విదేశీ మార్కెట్లో వెనకడుగు వేస్తున్నాయి. వెరసి వరుసగా మూడో రోజూ నేలచూపులతో కదులుతున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ నష్టాల బాట పట్టాయి. వివరాలు ఇలా..
అంతలోనే వెనక్కి
నేటి ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌లో సానుకూలంగా ప్రారంభమైన బంగారం, వెండి.. ధరలు అంతలోనే తోకముడిచాయి. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 142 క్షీణించి రూ. 50,679 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 784 నష్టంతో రూ. 65,000 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి రూ. 50,964 వద్ద గరిష్టాన్ని తాకగా.. వెండి రూ. 66,346కు ఎగసింది.
ఆటుపోట్ల మధ్య
బుధవారం వరుసగా రెండో రోజు పసిడి ధరలు వెనకడుగు వేశాయి. వెండి సైతం డీలా పడింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 681 క్షీణించి రూ. 50,821 వద్ద ముగిసింది. తొలుత 51,555 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,696 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 2,565 పడిపోయి రూ. 65,784 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 67,888 వరకూ బలపడిన వెండి ఒక దశలో రూ. 65,650 వరకూ వెనకడుగు వేసింది.
కామెక్స్‌లోనూ..
గత రెండు రోజుల పతనానికి చెక్ పెడుతూ విదేశీ మార్కెట్లో తొలుత బలపడిన పసిడి, వెండి ధరలు అంతలోనే డీలాపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.4 శాతం బలహీనపడి 1,937 డాలర్ల దిగువకు చేరింది. తొలుత 1956 డాలర్లకు చేరిన విషయం విదితమే. ఇక స్పాట్ మార్కెట్లోనూ 0.5 శాతం క్షీణించి 1933 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం ఔన్స్ 1.1 శాతం నష్టపోయి 27.13 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు రెండు రోజులు బలపడితే.. రెండు రోజులు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే.