న్యూయార్క్/ ముంబై: మరో నెల రోజుల్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు విడుదలకానున్న వార్తలు బంగారం, వెండి ధరలను దెబ్బతీస్తున్నాయి. గత వారం నాలుగు రోజులపాటు నేలచూపులకే పరిమితమైన బంగారం ధరలు వరుసగా రెండో రోజు పతనమయ్యాయి. వెరసి నాలుగు నెలల కనిష్టాలకు చేరాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు విడుదల చేసే వీలున్నట్లు వెలువడిన వార్తలు సోమవారం బంగారం, వెండి ధరలను పడగొట్టినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దేశ, విదేశీ మార్కెట్లో కొద్ది రోజులుగా అమ్మకాలు పెరిగినట్లు తెలియజేశాయి. కాగా. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా యూఎస్ పాలనావర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. దీనికితోడు వ్యాక్సిన్ల వార్తలతో ప్రపంచ ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా ముడిచమురు, ఈక్విటీలు, ట్రెజరీలు వంటి పెట్టుబడి సాధనాలవైపు ఇన్వెస్టర్ల దృష్టి మళ్లుతున్నట్లు వివరించారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో మాత్రమే పసిడికి డిమాండ్ కనిపిస్తుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రెండో రోజూ..
ఎంసీఎక్స్‌లో సోమవారం సాయంత్రం పతనమైన పసిడి, వెండి ధరలు వరుసగా రెండో రోజు నీరసించాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 555 క్షీణించి రూ. 48,925 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. రూ. 49,262 వద్ద వెనకడుగుతో ప్రారంభమైంది. ఆపై రూ. 48,923 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 765 నష్టపోయి రూ. 59,760 వద్ద కదులుతోంది. తొలుత రూ. 60,064 వద్ద బలహీనంగా ప్రారంభమైన వెండి తదుపరి రూ. 59,710 వరకూ వెనకడుగు వేసింది.
బలహీనంగా..
న్యూయార్క్ కామెక్స్‌లో సోమవారం ఉన్నట్టుండి పతనమైన బంగారం, వెండి ధరలు మరోసారి డీలాపడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1 శాతం(18 డాలర్లు) నష్టంతో 1,826 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.8 శాతం నీరసించి 1,824 డాలర్లకు చేరింది. వెండి సైతం 1.4 శాతం బలహీనపడి ఔన్స్ 24.43 డాలర్ల వద్ద కదులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment