
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, యస్‌బ్యాంకు, పీఎన్‌బీ, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు 2020 సంవత్సరానికి అగ్రగామి 10 బ్యాంకుల్లో స్థానం సంపాదించుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, డూచే బ్యాంకు, ఐడీబీఐ టాప్ 10లో వరుసగా ఉన్నాయి. అదే విధంగా గూగుల్‌పే, ఫోన్‌పే టాప్–2 వ్యాలెట్లుగా నిలిచినట్టు.. విజికీ విడుదల చేసిన ‘ది బీఎఫ్‌ఎస్‌ఐ మూవర్స్ అండ్ షేకర్స్ 2020’ నివేదిక ప్రకటించింది. బ్యాంకులు, వ్యాలెట్లు, యూపీఐ, ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల వేగవంతమైన పురోగతి గురించి ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తదనంతర పరిణామాలతో బీమాకు కూడా ఆదరణ బాగా పెరిగిపోయినట్టు తెలిపింది.
ఈ ఏడాది యూపీఐ, వ్యాలెట్లు బాగా వినియోగంలోకి వచ్చాయని, కస్టమర్లకు ఇవి చేరువ కావడానికి నూతన అవకాశాలు వాటికి అందుబాటులోకి వచ్చాయని వివరించింది. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వేగంగా రూపాంతరం చెందినట్టు పేర్కొంది. ఇక యోనో నంబర్ 1గా నిలవగా, నియో, కోటక్ 811 యాప్‌లు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘‘ఎన్‌బీఎఫ్‌సీలు ఈ ఏడాది ఎంతో కీలకపాత్ర పోషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈలు) నిధుల అవసరాలకు ప్రధాన వనరుగా మారాయి. కరోనా కాలంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలకు మరింతగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ విభాగంలో ఎక్స్‌పోజర్ పెంచుకున్నాయి’’ అని ఈ నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment