Shocking: Google Scott Hassan Created Revenge Website On Ex-Wife Name - Sakshi
Sakshi News home page

Scott Hassan-Allison Huynh: ఏడేళ్ల విడాకుల కొట్లాట ఇగోతో బిలియన్ల కోసం..!

Published Sun, Aug 22 2021 10:12 AM | Last Updated on Sun, Aug 22 2021 3:55 PM

Google Scott Hassan Admits Revenge Site Against Wife Allison Huynh - Sakshi

Scott Hassan-Allison Huynh Divorce Story: మనస్పర్థలు, మరోవ్యక్తితో  ఎఫైర్లు, ఇతరత్రాలు.. కారణం ఏదైనా సరే అర్ధాంతరంగా విడాకులకు వెళ్తూ ఆశ్చర్యపరుస్తుంటారు సెలబ్రిటీలు. ఇలాంటి వ్యవహారాలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారాయి. సాధారణంగా టెక్‌ బిలియనీర్లు .. నాలుగు గోడల మధ్య విడాకుల వ్యవహారాల్ని సైలెంట్‌గా సెటిల్‌ చేసుకుంటారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్జే బ్రిన్‌ నుంచి మొన్నటి జెఫ్‌ బెజోస్‌, నిన్నటి బిల్‌గేట్స్‌ దాకా.. అంతా ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌తో విడాకులు తీసుకున్నవాళ్లే.  కోర్టుకెక్కి వాదులాడుకోవడం చాలా అరుదైన సందర్భాల్లో చూస్తుంటాం. అలాంటి అరుదైన కేసుల్లో స్కాట్‌ హస్సన్‌-ఎల్లిసన్‌ హుయిన్హ్‌ జంట కేసు మరింత ప్రత్యేకమైంది.  

స్కాట్‌ హస్సన్‌(51).. అమెరికన్‌ బిలియనీర్‌, ప్రముఖ వ్యాపారవేత్త, గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు కూడా. 2014లో భార్య ఎల్లిసన్‌ హుయిన్హ్‌(46) నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కడు. పదమూడేళ్ల కాపురం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మధ్య ఆస్తి పంపకాల వల్లే విబేధాలు తలెత్తడం విశేషం. ఏడేళ్లుగా శాంటా క్లారా కౌంటీ కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. తద్వారా కాలిఫోర్నియా చరిత్రలో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న కేసుగా.. హస్సన్‌-ఎల్లిసన్‌ విడాకుల కేసు నిలిచింది. అయితే బిలియన్ల డాలర్ల విలువ చేసే సంపదను పంచుకోవడం కోసం కోర్టును ఆశ్రయించిన ఈ జంట.. చిల్లర ఆరోపణలు, డర్టీ వ్యవహారాలతో బజారుకెక్కడం విశేషం.
 

విడాకుల ఉగ్రవాదం!
భార్య మీద ప్రతీకారంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వెబ్‌సైట్‌ను లాంచ్‌ చేశాడు హస్సన్‌. అందులో గతంలో ఆమెకు ఉన్న ఎఫైర్లు.. ఆ ఎఫైర్ల సెటిల్‌మెంట్ల ద్వారా ఆమె రాబట్టిన పరిహారాలు అన్నీ వివరాలు డాక్యుమెంట్లతో సహా ఉన్నాడు. AllisonHuynh.com పేరు ఈ వెబ్‌సైట్‌ నడుస్తుండగా.. ఆలస్యంగా ఆ విషయం ఆమె దృష్టికి చేరింది. ఆమె అభ్యంతరాల నడుమ.. డాక్యుమెంట్లు సమర్పించాల్సిందిగా హస్సన్‌ను ఆదేశించాడు జడ్జి. దీంతో పూర్తి వివరాలను కోర్టుకు సైతం అందించాడు హస్సన్‌. ఇక ఈ వ్యవహారం తర్వాత భర్త మీద మండిపడింది ఎల్లిసన్‌. తమ పెళ్లినాటికి హస్సన్‌ 60వేల డాలర్ల అప్పులో కూరుకుపోయాడని, ఆ అప్పుంతా తానే తీర్చానని, చివరికి ఎంగేజ్‌మెంట్‌ సమయంలో చేతిలో చిల్లిగవ్వలేకపోతే.. తన డబ్బుతోనే ఫంక్షన్‌ చేశామని, దానికి గూగుల్‌ ఫౌండర్లు పేజ్‌, బ్రిన్‌ కూడా హాజరయ్యారని ఆమె అంటోంది. పైగా హస్సన్‌ పచ్చితాగుబోతు అని, తన సొంత ఇంట్లో వాళ్లపైనే అఘాయిత్యాలకు పాల్పడాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే హస్సన్‌ మాత్రం అంత స్థితికి ఎప్పుడూ దిగజారలేదని చెప్తున్నాడు. పైగా భార్య క్యారెక్టర్‌ మంచిది కాకపోయినా.. పిల్లల కోసం భరించానని అంటున్నాడు. మరోవైపు తనకుకు వ్యతిరేకంగా హసన్‌ భారీగా వెచ్చించి.. సోషల్‌ మీడియాలో ‘విడాకుల ఉగ్రవాదం’ ఉద్యమం నడిపిస్తున్నాడని అంటోంది ఎల్లిసన్‌.  తనను చంపి పాతరేస్తానని, చిల్లిగవ్వ కూడా దక్కకుండా చూస్తానని బెదిరించాడని ఎల్లిసన్‌ ఆరోపిస్తోంది.
 

ఇద్దరూ టెక్‌ మేధావులే
స్కాట్‌ హాస్సన్‌.. గూగుల్‌ను స్థాపించడంలో మూడో వ్యక్తి.  ఈయన పేరు ఎక్కువగా వినిపించదు. స్టాన్‌పోర్డ్ యూనివర్సిటీ గూగుల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రాజెక్టులో, గూగుల్‌ను సెర్చ్‌ ఇంజిన్‌గా తీర్చిదిద్దడంలో ఈయన చేసిన కోడింగ్‌ కీలకంగా వ్యవహరించింది. ఇక హుయిన్హ్‌.. వియత్నం వార్‌ టైంలో అమెరికాకు వలస వచ్చింది. వెబ్‌ డెవెలపర్‌గా వెల్స్‌ కార్గొ లాంటి టాప్‌ ఎంఎన్‌సీలతో కలిసి పని చేసింది. 2000 సంవత్సరంలో ఓ మ్యూచువల్‌ ఫ్రెండ్‌ ద్వారా ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఏడాది తర్వాత లాస్‌ వెగాస్‌ వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం. అయితే పెద్ద కూతురు రెండో పుట్టినరోజు నుంచి వీళ్ల మధ్య ఆర్థికపరమైన వివాదాలు తలెత్తాయి.
 

చదవండి: ప్రపంచానికి కొత్త కుబేరుడు

హుయిన్హ్‌ ఒప్పుకోలేదు
1998లో గూగుల్‌ను మొదలుపెట్టినప్పుడు తన వాటాగా 800 డాలర్లు చెల్లించి.. లక్షా అరవై వేల షేర్లు కొన్నాడు హస్సన్‌. 2004లో గూగుల్‌ ఐపీవోకి వెళ్లినప్పుడు.. ఆ స్టాక్స్‌ విలువ 200 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఆ విలువ ఇప్పుడు మాతృక సంస్థ ఆల్ఫాబెట్‌లో 13 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని ఒక అంచనా. ఇక తన సారథ్యంలోనే పుట్టిన ఈ-గ్రూప్స్‌ను.. యాహూకు మరో 432 మిలియన్ల డాలర్లు సంపాదించాడు హస్సన్‌. ఆపై సొంతంగా రెండు రోటోటిక్స్‌ కంపెనీలను నెలకొల్పాడు. ఇక తన ఆస్తుల నుంచి భార్యకు వైవాహిక సంబంధం ద్వారా అందించే వాటాగా..  20 మిలియ్‌ డాలర్ల స్టాక్స్‌ను ఇచ్చేందుకు హస్సన్‌ సిద్ధమయ్యాడు. కానీ, అందుకు హుయిన్హ్‌ ఒప్పుకోలేదు. తన కెరీర్‌ను సైతం త్యాగం చేసి కుటుంబం కోసం కేటాయించినందుకు అంత కొంత భాగమేనా? అన్నది ఆమె అభ్యంతరం. అప్పటి నుంచి పంపకం వ్యవహారంలో అసంతృప్తిగా ఉన్న ఆమె.. 2011లో మై డ్రీమ్‌ ట్రిప్‌ పేరుతో సొంత కంపెనీలు సైతం నడిపించింది.

చివరికి 2014లో ఓరోజు భర్త నెంబర్‌ నుంచి  ఒక మెసేజ్‌ వచ్చింది. ‘ఇక చాలు విడిపోదాం’ అని. ఆ మెసేజ్‌ను ఆమె జోక్‌ అనుకుంది. కానీ, ఏడాదిపాటు కౌన్సిలింగ్‌ జరిగినా కూడా.. ఇద్దరూ తగ్గలేదు. 2015 జనవరిలో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో ఆమె అల్ఫాబెట్‌ షేర్‌ పంపకాల కోసం కోర్టులో అడగలేదు.  కేవలం ఎస్టేట్‌ ఆస్తుల గురించి నడిచింది. 2019లో తనకు తెలియకుండా సూటబుల్‌ టెక్నాలజీస్‌ను అమ్మేయాలని ప్రయత్నించడంతో ఆమె అహం దెబ్బ తింది. దీంతో  బిలియన్ల ఆస్తులు, షేర్లలో వాటా కోసం దావా వేసింది. 2020 మేలో పెళ్లిని రద్దు చేసుకుని.. పిల్లల జాయింట్‌ కస్టడీకి ఇద్దరూ ఒప్పుకున్నారు. ప్రస్తుతం హస్సన్‌ పేరు మీద లిమిటెడ్‌ లయేబిలిటీ కంపెనీలు 50 ఉంటే.. వాటికి సంబంధించి షేర్‌ హోల్డ్స్‌ హక్కుల కోసం పోరాడుతోంది ఎల్లిసన్‌.
 


బిలియన్ల సంపద పంపకాలు, ఇగోలు, డర్టీ ఆరోపణలు.. ఈ జంట విడాకుల కేసును సంక్లిష్టంగా మారుస్తున్నాయి. సిలికాన్‌ వ్యాలీ కోర్టులో యాభై ఏళ్ల న్యాయవాదిగా ఉన్న పియర్స్‌ ఓడొన్నెల్‌.. ఎల్లిసన్‌ తరపున వాదిస్తున్నాడు. సోమవారం మొదలుకానున్న వాదనలు.. నాలుగు వారాలపాటు కొనసాగే అవకాశం ఉంది. ఎల్లిసన్‌ మరో జీవితాన్ని కోరుకుంటోంది. అందుకే విడాకులు-ఆస్తిపంపకాల కోసం తగ్గుతుందేమో అనుకునేరు!!. తగ్గేదే లేదంటున్న భార్యభర్తల పో(తీ)రు ఎటు పోతుందో తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.

-సాక్షి, వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement