టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చాలాకంపెనీలు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని అనుకుంటాయి. అందుకు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు కోరుతుంటాయి. అయితే కంపెనీలో ఏదైనా అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం అయితే ఆ కంపెనీ, ఇన్వెస్టర్లకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర విచారణ చేపడుతుంది.
తాజాగా పేటీఎంలో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లు ఆర్‌బీఐ గుర్తించిన విషయం తెలిసిందే. దాంతో కంపెనీపై చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పేటీఎంలో పెట్టుబడి పెట్టిన చైనా ఎఫ్‌డీఐలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
వన్97 కమ్యూనికేషన్స్ చెల్లింపు విభాగమైన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ (పీపీఎస్‌ఎల్)లో పెట్టుబడి పెట్టిన చైనా ఎఫ్‌డీఐలను ప్రభుత్వం పరిశీలించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిశీలనలు పూర్తయిన తర్వాత కమిటీ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేల నియంత్రణపై ఉన్న మార్గదర్శకాల కింద ‘పేమెంట్ అగ్రిగేటర్‌గా సేవలందించేందుకు అనుమతులు కోరుతూ’ 2020 నవంబరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దగ్గర పీపీఎస్‌ఎల్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. 2022 నవంబరులో పీపీఎస్‌ఎల్ దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది.
ఎఫ్‌డీఐ నిబంధనల కింద ప్రెస్ నోట్ 3 నిబంధనలను పాటిస్తూ, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. వన్97 కమ్యూనికేషన్స్‌లో చైనా సంస్థ యాంట్ గ్రూప్ పెట్టుబడులు ఉండటమే ఇందుకు కారణం. ప్రెస్ నోట్ 3 ప్రకారం.. చైనా సహా, భారత్‌తో సరిహద్దు పంచుకున్న దేశాల నుంచి ఏ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులకు అయినా కేంద్రప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
ఇదీ చదవండి: సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్.. సరికొత్త ప్లాన్‌లో పేటీఎం!
కొవిడ్-19 పరిణామాల్లో, దేశీయ సంస్థలను విదేశీయులు బలవంతంగా టేకోవర్ చేసుకుంటారనే ఉద్దేశంతో అటువంటివి నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్గానిస్థాన్ దేశాలకు ఇది వర్తిస్తుంది. అనంతరం 2022 డిసెంబరు 14న కంపెనీ మళ్లీ దరఖాస్తు చేసుకుంది. ఆన్‌లైన్ మర్చంట్స్ కోసం పీపీఎస్‌ఎల్ ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్ దరఖాస్తు చేసుకుందని, గత పెట్టుబడుల వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆర్‌బీఐ తెలిపినట్లు పేటీఎం అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment