Government Planning To Expand HallMark Services In Country - Sakshi
Sakshi News home page

హాల్‌మార్కింగ్‌ విధాన విస్తరణకు కసరత్తు

Published Tue, Dec 28 2021 8:45 AM | Last Updated on Tue, Dec 28 2021 9:18 AM

Government Planning To Expand HallMark Services In Country  - Sakshi

న్యూఢిల్లీ: పసిడి హాల్‌మార్కింగ్‌ విధానం కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా 256 జిల్లాల్లో ప్రస్తుతం సక్రమంగా, సజావుగా, ఎటువంటి అవరోధాలూ లేకుండా కొనసాగుతోందని వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ నెలవారీ నివేదిక తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఈ విధాన విస్తరణపై కసరత్తు జరుగుతోందని కూడా నివేదిక వివరించింది. క్యాబినెట్‌ కోసం సిద్ధమైన నివేదికలోని అంశాలు ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు క్లుప్తంగా.. 
- కనీసం ఒక పరీక్షా, హాల్‌మార్కింగ్‌ కేంద్రం(ఏహెచ్‌సీ) ఉన్న దేశంలోని 256 జిల్లాల్లో 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు– కళాఖండాలకు 2021 జూన్‌ 23 నుండి హాల్‌మార్కింగ్, నాణ్యతా ధృవీకరణ తప్పనిసరి చేయబడింది. అన్ని జిల్లాలకు దీనిని విస్తరించే ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది.  
- ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఆభరణాల కోసం జీరో రిజిస్ట్రేషన్‌ రుసుము, రిజిస్ట్రేషన్‌ జీవితకాల చెల్లుబాటు మొదలైన సులభతరమైన చర్యలను బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) తీసుకుంటూ.. ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్‌’ విధానం ప్రారంభించినప్పటి నుండి బీఐఎస్‌లో నమోదు చేసుకున్న ఆభరణ తయారీ, అమ్మకపు వర్తకులు, సంస్థల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. 
- ఇప్పటి వరకు 1.27 లక్షల మంది నగల వ్యాపారులు హాల్‌మార్క్‌ ఉన్న ఆభరణాలను విక్రయించడానికి బీఐఎస్‌ నుండి రిజిస్ట్రేషన్‌ తీసుకున్నారు.  బీఐఎస్‌ గుర్తింపు పొందిన 976 ఏహెచ్‌సీలు  దేశంలో పనిచేస్తున్నాయి.  
- ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించిన తర్వాత ఐదు నెలల వ్యవధిలో దేశంలో దాదాపు 4.5 కోట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ జరిగింది.  
- బంగారు ఆభరణాల పరిశ్రమ పనితీరులో మరింత పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా అలాగే వినియోగదారులకు హాల్‌మార్క్‌ విశ్వసనీయతను అందించడానికి హాల్‌మార్కింగ్‌ యూనిక్‌ ఐడీ (హెచ్‌యూఐడీ) ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.  
- హాల్‌మార్కింగ్‌కు సంబంధించి సమస్యలపై పరిశ్రమ వర్గాలతో నిరంతర, వివరణాత్మక పరస్పర చర్యలు, చర్చల ద్వారా వారి ఆందోళనల పరిష్కారానికి బీఐఎస్‌ ప్రయత్నిస్తోంది. 
- 2021 జనవరి 15 నుండి దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు– కళాఖండాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేయనున్నట్లు 2019 నవంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ గడువును జూన్‌ 1వ తేదీకి అటు తర్వాత జూన్‌ 23వ తేదీకి కేంద్రం పొడిగించింది. జూన్‌ 23 నుంచి ఈ తప్పనిసరి విధానం అమల్లోకి వచ్చింది. మహమ్మారి కరోనా నేపథ్యంలో అమల్లో కష్టనష్టాలు ఉంటాయని వర్తకులు కేంద్రానికి విన్నవించడం ‘గడువు పొడిగింపులకు’ ప్రధాన కారణం.  
- భారతదేశం బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం. భారత్‌ తన బంగారం అవసరాలకు ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఏటా 700–800 టన్నుల శ్రేణిలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశంలో 2016–2020 మధ్య జరిగిన మొత్తం సరఫరాల్లో దిగుమతుల వాటానే 86 శాతం వరకూ ఉందని గణాంకాలు వివరిస్తున్నాయి.  
 

చదవండి: గనుల వేలానికి హైపవర్‌ కమిటీ ఆమోదం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement