
న్యూఢిల్లీ: వినియోగదారులు తమ వద్దనున్న హాల్‌మార్క్‌లేని బంగారం ఆభరణాల స్వచ్ఛతను బీఐఎస్ ధ్రువీకృత కేంద్రాలకు వెళ్లి పరీక్షించుకోవచ్చు. నాలుగు ఆర్టికల్స్ (ఆభరణాలు) వరకు స్వచ్ఛత కోసం రూ.200 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఐదు అంతకంటే ఎక్కువ ఆర్టికల్స్ ఉంటే ఒక్కో ఆర్టికల్‌కు రూ.45 చొప్పున చార్జీ ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది.
తద్వారా వినియోగదారులు తమవద్దనున్న హాల్‌మార్క్‌లేని ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు పేర్కొంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) గుర్తింపు కలిగిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్స్‌కు వెళ్లి పరీక్షించుకోవచ్చని సూచించింది.
ఇక వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఆభరణాలకు సంబంధించి ‘హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్’ను బీఐఎస్ కేర్ యాప్ నుంచి పరిశీలించుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయమని తెలిపింది.
హాల్‌మార్క్ అంటే ?
కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో.