న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఒక బిల్లును తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం బిల్లును ప్రవేశపెడతామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 23 వరకు కొనసాగుతాయని తెలిసిందే. క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు సభ్యుల నుంచి వ్యక్తం అవుతుండడంతో మంత్రి దీనిపై స్పందించారు. వర్చువల్ కరెన్సీల్లో వేగంగా వస్తున్న మార్పులను నూతన బిల్లు పరిగణనలోకి తీసుకుంటుందని, క్రితం బిల్లులో లేని అంశాలను పొందుపరచనున్నట్టు చెప్పారు. ‘క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021’ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. ‘‘చివరిగా వర్షకాల సమావేశాల్లోనూ బిల్లును తీసుకొస్తామనడం నిజమే. కానీ, ఇతర పరిణామాల వల్ల బిల్లుపై తిరిగి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. గత సమావేశాల్లోనూ బిల్లును తీసుకొచ్చేందుకు నిజాయితీ ప్రయత్నాలే చేశాం. ఇప్పుడు నూతన బిల్లుతో సభ ముందుకు వస్తున్నాం’’ అని మంత్రి సీతారామన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలను దేశంలో నియంత్రించడం లేదని, క్రిప్టోకరెన్సీల లావాదేవీల సమాచారాన్ని ప్రభుత్వం సమీకరించడం లేదని స్పష్టం చేశారు.
పోలీసు రుణాలపై
పోలీసు సిబ్బంది తదితర సున్నితమైన ఉద్యోగాల్లో ఉన్న వారికి రుణాలు ఇవ్వొద్దంటూ బ్యాంకులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని మంత్రి సీతారామన్ మరో ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభకు తెలియజేశారు.
నిషేధించడం అవివేకమే: ఓఆర్‌ఎఫ్
భారత్‌లో 1.5 కోట్ల మంది డిజిటల్ కరెన్సీలను కలిగి ఉన్నందున.. వీటిని ఇతర ఆర్థిక సాధనాల మాదిరి నియంత్రించాలే కానీ, నిషేధించడం అవివేకమే అవుతుందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్‌ఎఫ్) పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో క్రిప్టో ఆస్తుల పరిశ్రమ భారత్‌లో బాగా వృద్ధిని చూసిందని, సుమారు 1.5 కోట్ల మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారని తెలిపింది. ‘‘భారత్‌లో ఇప్పుడు 350 వరకు క్రిప్టో స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, వినియోగదారుల సంక్షేమం దృష్ట్యా క్రిప్టోలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ, అన్నింటిపైనా నిషేధం విధించడం సరైనది కాదు. దీనివల్ల ప్రభుత్వం గణనీయమైన ఆదాయం కోల్పోతుంది. అంతేకాదు చట్టవిరుద్ధమైన సంస్థలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’ అంటూ ఓఆర్‌ఎఫ్ తన నివేదికలో ప్రస్తావించింది.
చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం! ఈలోపే భారత్‌లో మరో..
Comments
Please login to add a commentAdd a comment