
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.6 లక్షల మందికి సబ్సిడీ అందించినట్లు కేంద్రం తెలిపింది. వినియోగదారుల ఖాతాల్లో జమయ్యే సబ్సిడీకి సంబంధించి ప్రక్రియ సమయాన్ని నెల నుంచి ఏడు రోజులకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన బడ్జెట్ సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రవేశపడుతున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫిబ్రవరిలో కేంద్రమంత్రి ఈ పథకం వివరాలు ప్రకటించినప్పటి నుంచి దాదాపు 1.3 కోట్ల దరఖాస్తులు నమోదయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందులో 3.85 లక్షల గృహ వినియోగదారుల ఇళ్లలో సోలాన్ ప్యానెళ్ల ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తియిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.6 లక్షల మంది లబ్ధిదారులకు సబ్సిడీ అందిందని చెప్పారు. గతంలో ప్రభుత్వం సబ్సిడీ అందించేందుకు బ్యాంక్ ఖాతాలు, చెక్‌లను వినియోగించేది. తాజాగా వాటి స్థానంలో ఎన్‌పీసీఐ సేవలు వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లు
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఫిబ్రవరి 15, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలో కోటి గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను వినియోగించేలా ప్రోత్సాహకాలు అందిస్తారు. ఈ సోలార్ ప్యానెళ్లను అమర్చుకునే గృహ వినియోగదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందవచ్చు. దీనికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి. సోలార్ ప్యానెల్‌లకు తగిన ఇంటి పైకప్పు ఉండాలి. ఇతర సోలార్ ప్యానెల్ సబ్సిడీని పొందకూడదు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (ఎన్‌పీఏఐ), రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (ఎస్‌ఐఏ) నిర్వహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment