సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.3,500 కోట్లకు పైగా మొత్తాన్ని డీలర్లు ఎగ్గొట్టారని వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత అంచనాకు వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ వసూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న ఆ శాఖ ఈ మేరకు పన్ను ఎగవేత జరిగినట్టుగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా కరోనా వైరస్ విజృంభణతో లాక్‌డౌన్ విధించిన కాలంలోనూ, ఆ తర్వాత తనిఖీలు పెద్దగా నిర్వహించలేకపోయిన కారణంగా రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున జీరో సరుకు వచ్చిందని వాణిజ్య పన్నుల అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, స్టీల్ ఉత్పత్తులతో పాటు, మరికొన్ని వస్తువులు ఎలాంటి ఇన్వాయిస్‌లు లేకుండా చెక్‌పోస్టులు దాటి జీరో సరుకు రూపంలో రాష్ట్రంలోకి ప్రవేశించడం, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా డీలర్లు ఎక్కువగా క్లెయిమ్ చేసుకోవడం వల్ల పన్ను ఎగవేత ఈసారి రూ.3,500 కోట్లు మించిందని అంతర్గత లెక్కల్లో తేల్చినట్టు సమాచారం. వీటితోపాటు దుస్తులు, కరోనా కాలంలో విరివిగా వినియోగిస్తున్న మాస్క్ లు, శానిటైజర్లు, ఫార్మా ఉత్పత్తుల్లోనూ పన్ను ఎగవేతలు జరిగాయన్న దానిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతున్నారు.
ఈసారి పకడ్బందీగా..
ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగా కాకుండా ఈసారి పన్ను ఎగవేత లేకుండా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించే పనిలో వాణిజ్య పన్నుల అధికారులు నిమగ్నమయ్యారు. రాబడి లోటును అధిగమించడమే కాకుండా పన్ను ఎగవేత, ఇతర రూపాల్లోని అక్రమాలను అరికట్టేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 460 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 1,370 మంది వివిధ స్థాయిల్లోని అధికారులు, సిబ్బందిని సభ్యులుగా నియమించారు. అక్రమాలను గుర్తించి శాఖకు రావాల్సిన రాబడిని నష్టపోకుండా చూసేందుకు గాను ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు.
డేగ కళ్ల నిఘాతో నిరంతరం అప్రమత్తంగా ఉండి ఈ-ఇన్వాయిస్‌లు పక్కాగా అమలయ్యేలా, చెక్‌పోస్టుల వద్ద సరుకు జీరోగా మారకుండా పహరా కాయాలని వాణిజ్య పన్నుల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం చెక్‌పోస్టుల నుంచి నేరుగా హైదరాబాద్‌లోని సెంట్రల్ కార్యాలయాన్ని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసింది. ‘పన్ను ఎగవేతను పూర్తి స్థాయిలో నిరోధించడం సాధ్యం కాదు. అయితే, సాధ్యమైనంత మేర అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ ఖజానా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మాది. అందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నాం..’అని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.
ఓటీఎస్‌కు వెళ్తే వేల కోట్లు
మరోవైపు దశాబ్దాల తరబడి వివాదాల రూపంలో కోర్టుల్లో నలుగుతున్న కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఈ ఏడాది వేల కోట్ల రూపాయలను రాబట్టుకోవాలనేది వాణిజ్య పన్నుల అధికారుల వ్యూహంగా కనిపిస్తోంది. హైకోర్టులో 479 కేసుల్లో ఉన్న రూ.1,960 కోట్లు, సుప్రీంకోర్టులో ఉన్న 34 కేసుల్లోని రూ.574 కోట్లు, అంతర్గత ట్రిబ్యునల్ పరిధిలోని 2,505 కేసుల్లో ఉన్న రూ.1,153.51 కోట్లతో పాటు పాతబకాయిలు రూ.130 కోట్లు, 13 ఏళ్ల పాటు బకాయిల వ్యత్యాసం కింద పెండింగ్‌లో ఉన్న రూ.1,907 కోట్లను ఎలాగైనా రాబట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే ఈ పెండింగ్ పన్నుల వసూలుకు గాను వన్‌టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) లేదా ఇతర అందుబాటులో ఉన్న మార్గాలపై వాణిజ్య పన్నుల యంత్రాంగం దృష్టి సారించింది.
( చదవండి: పసిడి పరుగులకు బ్రేక్! )
Comments
Please login to add a commentAdd a comment