
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారినుంచి కోలుకుని లాభాల బాట పడుతున్న ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఊరటనిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హెచ్‌సీఎల్ టెక్ నిలిచింది. దశలవారీగా వివిధ స్థాయిల్లో ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సీ విజయ్ కుమార్ తెలిపారు. అలాగే 9 వేల మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వెల్లడించింది. ఆదాయాలు, నికర లాభాలు రెండింటిలో పెరుగుదల కారణంగా మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులకు జీతం పెంపును ప్రకటించింది.
జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన హెచ్‌సీఎల్ ఈ రానున్న ఆరు నెలల కాలంలో 9వేల మందిని తీసుకుంటామని తెలిపింది. అలాగే తమ వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. ఆట్రిషన్ (ఉద్యోగుల వలస) 12.2 శాతంగా నమోదయింది. గత ఏడాది భారత్‌లోని సిబ్బందికి 6 శాతం వేతనాలు, విదేశాల్లోని సిబ్బందికి 2.5 శాతం వేతనాలు పెంచింది. మరోవైపు గత నెలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఐటీసీని దాటి 10వ స్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. కాగా హెచ్‌సీఎల్ లో 1,53,085 మంది ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment