న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 57,000 కోట్లు సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అన్‌సెక్యూర్డ్, రిడీమబుల్, నాన్‌కన్వర్టిబుల్ డిబెంచర్ల జారీకి బోర్డు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలియజేసింది. షెల్ఫ్ ప్లేస్‌మెంట్ మెమొరాండంకింద మొత్తం రూ. 57,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వివరించింది.
ప్రయివేట్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా వివిధ దశలలో వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. గతేడాది(2022) జూన్ 30న నిర్వహించిన 45వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఇందుకు అనుమతించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. మరోవైపు కంపెనీ మొత్తం రుణ సమీకరణ సామర్థ్యాన్ని రూ. 6 లక్షల కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు ఆమోదించినట్లు తెలియజేసింది.
ఈ అంశంపై ఎప్పుడైనా పోస్టల్ బ్యాలట్ ద్వారా సభ్యుల నుంచి అనుమతి కోరేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. ప్రస్తుతం సుమారు రూ. 5.7 లక్షల కోట్లుగా ఉన్న ఔట్‌స్టాండింగ్ రుణాలను బిజినెస్ అవసరాలరీత్యా పెంచుకునేందుకు వీలున్నట్లు తెలియజేసింది. గ్రూప్‌లోని మరో దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో విలీనంకానున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే రుణ సమీకరణ చేపట్టవచ్చని తెలియజేసింది. ఈ ఏప్రిల్‌తో ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో విలీనం పూర్తికావచ్చని అంచనా. విలీనం తదుపరి ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐతో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలువ రెట్టింపుకానుంది!
Comments
Please login to add a commentAdd a comment