Non-convertible debentures
-
వోల్టాస్ లాభం రూ.36 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే పనితీరు మెరుగుపడినట్టు తెలుస్తోంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,833 కోట్ల నుంచి రూ.2,364 కోట్లకు వృద్ధి చెందింది. రెడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీలు) జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని వోల్టాస్ బోర్డు నిర్ణయించింది. చైన్నై, గుజరాత్‌లోని వాఘోడియాలో నూతన ప్లాంట్లపై ఈ నిధులను వ్యయం చేయనున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వోల్టాస్ షేరు ఒక శాతం లోపు పెరిగి రూ.839 వద్ద ముగిసింది. -
ఎన్సీడీల జారీతో రూ. 57,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 57,000 కోట్లు సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అన్సెక్యూర్డ్, రిడీమబుల్, నాన్‌కన్వర్టిబుల్ డిబెంచర్ల జారీకి బోర్డు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలియజేసింది. షెల్ఫ్ ప్లేస్మెంట్ మెమొరాండంకింద మొత్తం రూ. 57,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వివరించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా వివిధ దశలలో వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. గతేడాది(2022) జూన్ 30న నిర్వహించిన 45వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఇందుకు అనుమతించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. మరోవైపు కంపెనీ మొత్తం రుణ సమీకరణ సామర్థ్యాన్ని రూ. 6 లక్షల కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు ఆమోదించినట్లు తెలియజేసింది. ఈ అంశంపై ఎప్పుడైనా పోస్టల్ బ్యాలట్ ద్వారా సభ్యుల నుంచి అనుమతి కోరేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. ప్రస్తుతం సుమారు రూ. 5.7 లక్షల కోట్లుగా ఉన్న ఔట్‌స్టాండింగ్ రుణాలను బిజినెస్ అవసరాలరీత్యా పెంచుకునేందుకు వీలున్నట్లు తెలియజేసింది. గ్రూప్‌లోని మరో దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో విలీనంకానున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే రుణ సమీకరణ చేపట్టవచ్చని తెలియజేసింది. ఈ ఏప్రిల్‌తో ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో విలీనం పూర్తికావచ్చని అంచనా. విలీనం తదుపరి ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలువ రెట్టింపుకానుంది! -
జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రూ. 1,150 కోట్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్–కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) రూ. 1,150 కోట్లు సమీకరించింది. ఈ ఎన్సీడీలను బీఎస్ఈలో లిస్ట్ చేయ నున్నట్లు సంస్థ తెలిపింది. వీటిపై తొలి అయిదేళ్ల పాటు వార్షికంగా వడ్డీ రేటు 8.805 శాతంగా ఉంటుందని, ఆ తర్వాత మరో అయిదేళ్ల వ్యవధికి సంబంధించి మార్పులు ఉంటాయని పేర్కొంది. 2024, 2026లో మెచ్యూర్ అయ్యే కొన్ని ఈసీబీ (విదేశీ వాణిజ్య రుణాల) బాండ్లను పాక్షికంగా చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. జీహెచ్ఐఏఎల్ దేశీ డెట్ మార్కెట్లో నిర్వహించిన తొలి లిస్టెడ్ లావాదేవీకి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. తమ గ్రూప్‌పై మదుపుదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. -
ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ మళ్లీ డిఫాల్ట్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్) మరోసారి డిఫాల్ట్ అయ్యింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు (ఎన్సీడీ/బాండ్ల జారీ) సంబంధించి 2022 ఏప్రిల్ 13 నాటికి చెల్లించాల్సిన రూ.1.22 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు ఒక రెగ్యులేటీ ఫైలింగ్‌లో తెలిపింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఈ తరహా డిఫాల్ట్ వారంలో ఇది రెండవసారి. ఏప్రిల్ 12న ఎఫ్ఈఎల్ ఒక ప్రకటన చేస్తూ, ఎన్‌సీడీలకు సంబంధించి మొత్తం రూ.9.10 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు పేర్కొంది. 2021 అక్టోబర్ 13 నుంచి 2022 ఏప్రిల్ 12 మధ్య (ఎస్సీడీలకు సంబంధించి) ఈ వడ్డీ చెల్లింపుల్లో విఫలమయినట్లు వివరించింది. ఈ నెల ప్రారంభంలో ఎఫ్ఈఎల్ ఒక ప్రకటన చేస్తూ, ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి బ్యాంకింగ్ కన్సార్షియంకు రూ.2,836 కోట్ల డిఫాల్ట్ అయినట్లు వెల్లడించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్‌కు ఫ్యూచర్ గ్రూప్ విక్రయించాలని ప్రతిపాదించిన 19 కంపెనీల్లో ఎఫ్ఈఎల్ ఒకటి. 2020 ఆగస్టు నాటి రూ.24,713 కోట్ల విలువైన ఈ డీల్‌పై అమెజాన్ లేవనెత్తిన వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్‌సహా పలు న్యాయ వేదికలపై విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. -
రూ. 200 కోట్ల సమీకరణలో అపోలో హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ ద్వారా రూ. 200 కోట్లు సమీకరించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ వెల్లడించింది. రూ. 10 లక్షల ముఖ విలువ గల ఎన్సీడీల జారీకి కంపెనీ బోర్డు కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ పరిస్థితుల్లో అదనంగా రూ. 100 కోట్లు అట్టే పెట్టుకునే విధంగా గ్రీన్‌షూ ఆప్షన్‌తో ఎన్సీడీల జారీ ఉండగలదని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి పదేళ్ల కాలవ్యవధితో వీటిని జారీ చేయనుంది. మంగళవారం అపోలో హాస్పిటల్స్ షేరు స్వల్పంగా తగ్గి రూ. 1,353 వద్ద ముగిసింది.