ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విశ్వకర్మ పథకంతో సంప్రదాయ హస్తకళలు, తత్సంబంధ వర్గాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు. మార్కెట్లు, రుణ సదుపాయాలు తగినంత స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల వడ్రంగులు, చేనేతకారులు, బొమ్మల తయారీదారులు మొదలైన వారు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని, ఈ స్కీము వారి స్థితిగతులను మార్చగలదని ఆయన చెప్పారు.
దాదాపు రూ. 13,000 కోట్ల ప్రాథమిక కేటాయింపులతో విశ్వకర్మ పథకం సుమారు 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చగలదన్నారు. అధికారిక లెక్కల ప్రకారం దేశీయంగా 70 లక్షల పైచిలుకు చేతివృత్తుల వారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ ఇది 20 కోట్ల స్థాయిలో ఉండొచ్చని అనధికారిక లెక్కలు ఉన్నాయని చౌహాన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధినిస్తున్న ఈ రంగానికి, ఇటువంటి పథకాలతో మరింత ప్రయోజనం చేకూరగలదని చిన్న, మధ్య తరహా సంస్థల శాఖ కమిటీలో ఒక సభ్యుడిగా తాను భావిస్తున్నట్లు వివరించారు. మూడు దశాబ్దాల క్రితం ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా స్క్రీన్ ఆధారిత ట్రేడింగ్ ఎలాగైతే అందుబాటులోకి వచ్చి, మార్కెట్లలో పెట్టుబడుల తీరును మార్చేసిందో.. ఈ స్కీము కూడా చేతివృత్తుల వారికి తోడ్పడగలదని చౌహాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment