హిందుస్థాన్ యూనిలీవర్ హార్లిక్స్ లేబుల్‌ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’గా పిలిచే హార్లిక్స్‌ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరీలోకి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల్లో వచ్చిన సూచనల మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మార్పులు చేయాలని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌ను ఆదేశించింది. దాంతో కంపెనీ తన ప్రతిష్టాత్మక ఉత్పత్తి అయిన హార్లిక్స్ ప్రస్తుత కేటగిరీ ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ నుంచి ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్(ఎఫ్‌ఎన్‌డీ)’లోకి మారుస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) రితేష్ తివారీ మాట్లాడుతూ..హార్లిక్స్ ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్(ఎఫ్‌ఎన్‌డీ) లేబుల్‌కు మారడం వల్ల స్పష్టమైన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో ‘హెల్త్ డ్రింక్స్’కు కచ్చితమైన నిర్వచనం లేకపోవడం వల్ల రెగ్యులేటరీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలిసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇటీవల ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో డైరీ ఉత్పత్తులను లేబులింగ్ చేయకూడదని తెలిపింది. తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, ఆరెంజ్, లైమ్ వంటి ఫ్లేవర్లతో కూడిన ఆరోగ్య పానీయాల కేటగిరీలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపింది.
బోర్న్‌విటా వివాదం
బోర్న్‌విటా వంటి పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ అని లేబుల్ చేయరాదని ప్రభుత్వం ఇటీవల ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు సూచించింది. దేశ ఆహార చట్టాల్లో ఆ వర్గానికి సరైన నిర్వచనం లేదని తెలిపింది. దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్యాడ్‌బరీ బోర్న్‌విటాలో అధిక చక్కెర కంటెంట్ ఉందని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒకరు వీడియో ద్వారా ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.. ఎక్కడో తెలుసా..
బోర్న్‌విటా మాతృ సంస్థ మాండలిజ్ ఇండియా ఆ వీడియోను తొలగించాలని సదరు వ్యక్తికి లీగల్ నోటీసు జారీ చేసింది. అయితే వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్యాకేజింగ్, ప్రకటనలు, లేబుల్‌లను తొలగించాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment