పెరుగుతున్న ఇంధన డిమాండ్‌కు అనువుగా దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడానికి గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హిటాచి భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తోంది.
ఈ మేరకు కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నుగురి వేణు మాట్లాడుతూ..‘భారత్‌లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచేలా కంపెనీ కార్యకలాపాలు ఉండనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్, పుణెలో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిని రానున్న ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. అయితే అవసరాలకు అనుగుణంగా అందులో మార్పులు చేసే అవకాశం ఉంది’ అన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్లు, భారీస్థాయి పవర్ ట్రాన్స్‌మిటర్‌లను తయారు చేసే హిటాచీ ఎనర్జీ కంపెనీ దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచేలా పనిచేయనుంది. 2030 వరకు భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే లక్ష్యం పెట్టుకుంది. దాంతో భారత ప్రభుత్వం గత సంవత్సరం గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం ప్రోత్సాహకాలను విడుదల చేసింది. భారత్ లక్ష్యాన్ని సాధించేలా ఈ కంపెనీ తనవంతు సహకారం అందించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: భారీ వరదలు.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఎలా ఉందంటే..
2023 ఆర్థిక సంవత్సరంలో దేశ విద్యుత్ వినియోగం 8% పెరిగింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా ప్రకారం.. రాబోయే మూడేళ్లలో దేశ విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో తయారవుతున్న విద్యుత్ కంటే కనీసం 3-4 రెట్లు ఉత్పత్తి పెరగాల్సి ఉందని కంపెనీ ఎండీ, సీఈఓ వేణు అన్నారు. అందుకు అనుగుణంగా తమ ఆర్డర్‌బుక్ కూడా 2-3 రెట్లు పెరుగుతుందని ఆయన ధీమావ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment