ప్రపంచ సినీ పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు హాలీవుడ్ (Hollywood) గురించే గొప్పగా చెప్పుకొంటాం. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు, షోలు అక్కడి నుంచే వస్తాయి. సాంకేతిక విలువల్లో ఏ మాత్రం రాజీ పడకుండా చిత్రాలు నిర్మిస్తుంటారు అక్కడి దర్శక నిర్మాతలు. అయితే అంతటి ప్రాముఖ్యత ఉన్న హాలీవుడ్‌లో ఓ వైపు స్ట్రైక్‌లు కొనసాగుతుండగా మరోవైపు వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు.
గత సెప్టెంబరులో అమెరికాలో 3,36,000 ఉద్యోగాలు పెరిగాయి. బ్లూమ్‌బెర్గ్ సర్వేలో ఆర్థికవేత్తలు ఊహించిన దాని కంటే ఇది దాదాపు రెండింతలు. అయితే ఇందుకు భిన్నంగా హాలీవుడ్‌లో ఉపాధి కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.
బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం , చలనచిత్రం, సౌండ్ రికార్డింగ్ పరిశ్రమలలో ఆగస్ట్‌లో 17,000 మంది ఉపాధి కోల్పోయిన తర్వాత సెప్టెంబర్ నెలలో మరో 7,000 మంది ఉపాధి కోల్పోయారు. హాలీవుడ్‌లో మే నెలలో సమ్మెలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 45,000 మంది ఉపాధి కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,60,000 మంది నటీ నటులు, అనౌన్సర్లు, రికార్డింగ్ కళాకారులు, ఇతర మీడియా నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ SAG-AFTRA అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ (AMPTP)తో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన తర్వాత జూలై 14న సమ్మె ప్రారంభించింది. వార్నర్ బ్రదర్స్, డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, యాపిల్, ఎన్‌బీసీ యూనివర్సల్, పారామౌంట్, సోనీతో సహా ప్రధాన స్టూడియోల తరపున AMPTP సంప్రదింపులు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment