న్యూఢిల్లీ: దేశంలో అధిక శాతం ప్రజలు (35 శాతం) రూ.90 లక్షల్లోపు ఇంటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్లలోపు ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వేలో 34 శాతం మంది చెప్పారు.
2020 ద్వితీయ ఆరు నెలల్లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే 10 శాతం పెరుగుదల కనిపించింది. అంతకుముందు సర్వేలో 27 శాతం మందే అందుబాటు ధరల ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సీఐఐ, ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సంయుక్తంగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య ఆన్‌లైన్ సర్వే నిర్వహించాయి. 4,965 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారు చెప్పిన అభిప్రాయాలను పరిశీలించినట్టయితే..
►80 శాతం మంది నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను కొనుగోలుకే ఆసక్తి చూపిస్తున్నారు. లేదంటే నిర్మాణం పూర్తయ్యే దశలోని వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం 20 శాతం మందే కొత్తగా ఆరంభించిన ప్రాజెక్టుల్లో కొనుగోలుకు సంసిద్ధంగా ఉన్నారు.
► 34 శాతం మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసుకుందామన్న ఆలోచనతో ఉన్నవారు రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల బడ్జెట్‌లోని వాటి కోసం చూస్తున్నారు.
35 శాతం మంది రూ.45–90 లక్షల పరిధిలోని వాటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
►అందుబాటు ధరల్లోని ఇళ్లకోసం (రూ.45లక్షల్లోపు) చూస్తున్నవారు 27 శాతం మంది ఉన్నారు.
► ధర తర్వాత ఎక్కువగా చూసే అంశం డెవలపర్ విశ్వసనీయత. 77 శాతం మంది విశ్వసనీయమైన డెవలపర్ల నుంచే ఇళ్లను కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు.
►ఆన్‌లైన్‌లో ఇళ్ల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. కరోనాకు ముందు మొత్తం ఇళ్ల కొనుగోలు ప్రక్రియలో 39 శాతం ఆన్‌లైన్‌లో కొనసాగగా.. ఇప్పుడు 60 శాతానికి చేరుకుంది.
►ఇళ్ల కోసం అన్వేషణ, డాక్యుమెంటేషన్, న్యాయ సలహాలు, చెల్లింపులు దేశ హౌసింగ్ రంగానికి సానుకూలతలుగా అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి పేర్కొన్నారు.
►వ్యక్తిగత అవసరాల కోసం రెండో ఇంటిని కొనుగోలు చేస్తామని 41 శాతం మంది సర్వేలో చెప్పారు.
►ఎత్తయిన కొండ, పర్వత ప్రాంతాలు 53 శాతం మంది ఎంపికగా ఉన్నాయి.
►బెంగళూరు, పుణె, చెన్నై ఎన్‌ఆర్‌ఐల ఎంపికల్లో అగ్రస్థానాల్లో ఉన్నాయి.
తక్కువ వడ్డీ రేట్లు
‘‘గృహ రుణాలపై వడ్డీరేట్లు కనిష్టాల్లో ఉండడం ఇళ్ల విక్రయాలు పెరిగేందుకు ప్రధానంగా మద్దతునిస్తున్న అంశం. తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంలో తక్కువ రుణ రేట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని 82 శాతం మంది చెప్పారు’’ అని ఈ సర్వే నివేదిక తెలిపింది.
ఇళ్ల ధరలు పెరుగుతాయ్
పెరుగుతున్న డిమాండ్ వల్ల నివాస భవనాల మార్కెట్ రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధిని చూస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో నిర్మాణ సామగ్రి కోసం వ్యయాలు అధికమవుతున్నందున ఇళ్ల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నాయి. సీఐఐ అనరాక్ వెబినార్ కార్యక్రమంలో భాగంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు ఈ అభిప్రాయాలను వెల్లడించారు. కరోనా మొదటి, రెండో విడతల తర్వాత ఇళ్ల విక్రయాలు పుంజుకోవడం తమను ఆశ్చర్యపరిచినట్టు చెప్పారు. పెద్ద బ్రాండెడ్ రియల్ ఎస్టేట్ సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకున్నాయని పేర్కొన్నారు. ఈ వెబినార్‌కు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి మధ్యవర్తిగా వ్యవహరించారు.
‘‘ధరలు పెరగడం తప్పనిసరి. నిర్మాణ వ్యయాలు పెరిగిపోయాయి. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతోపాటు సరఫరా సమస్యలు కూడా కారణమే. డెవలపర్లు చిన్న, పెద్దవారైనా మెరుగైన నిర్వహణ చరిత్ర ఉంటే ఇక ముందూ మెరుగ్గానే కొనసాగొచ్చు. కానీ, పరిశ్రమలో స్థిరీకరణ, వృద్ధిని స్పష్టంగా చూస్తున్నా’’ అని ఒబెరాయ్ రియాలిటీ చైర్మన్, ఎండీ వికాస్ ఓబెరాయ్ తెలిపారు. ఇళ్ల ధరలు వచ్చే ఏడాది కాలంలో 15 శాతం వరకు పెరగొచ్చని శ్రీరామ్‌ప్రాపర్టీస్ ఎండీ ఎం.మురళి సైతం ఇదే కార్యక్రమంలో భాగంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment