న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా.. భారత మార్కెట్లో 2030 నాటికి అయిదు కొత్త ఎస్‌యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ సైతం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయా సుమురా తెలిపారు. మధ్యస్థాయి ఎస్‌యూవీ ఎలివేట్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘ఎలివేట్ సాయంతో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీ, అమేజ్ సెడాన్లను భారత్‌లో విక్రయిస్తున్నాం. మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో సెడాన్ల వాటా 10 శాతమే. ఈ విభాగంలోనే కంపెనీ పోటీపడుతోంది. అలాగే ఈ మోడళ్లు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయి. ఎలివేట్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టాం. రానున్న రోజుల్లో ఈ మోడల్ ప్రధాన ఉత్పాదనగా ఉంటుంది. కొత్తగా వచ్చే మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడతాయి. ఎలివేట్ ఎగుమతి కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దుతాం. ఇక 2022–23లో 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశాం. 2024–25లో దీనిని 1.7 లక్షల యూనిట్లకు చేరుస్తాం’ అని వివరించారు.
2040 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని హోండా మోటార్ కో ఆసియా హెడ్ తోషియో కువహర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment