న్యూఢిల్లీ: హౌసింగ్ (ఇళ్ల నిర్మాణం)లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. జనవరి–జూన్ మధ్య 433 మిలియన్ డాలర్లు (రూ.3,526 కోట్లు) వచ్చాయి. ఈ వివరాలను కొలియర్స్ ఇండియా ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో హౌసింగ్‌లో పెట్టుబడులు 89.4 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండస్ట్రియల్, వేర్ హౌసింగ్ ఆస్తుల్లోకి 95 శాతం అధికంగా 350 మిలియన్ డాలర్ల (రూ.2870 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి.
క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్‌లోకి వచి్చన పెట్టుబడులు 179.8 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఫ్యామిలీ ఆఫీస్‌లు, విదేశీ కార్పొరేట్ సంస్థలు, విదేశీ బ్యాంక్‌లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, రియల్ ఎస్టేట్ ఫండ్ సంస్థలు, విదేశీ ఎన్‌బీఎఫ్‌సీ, సావరీన్ వెల్త్ ఫండ్స్ (సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం) ఈ పెట్టుబడులు సమకూర్చాయి. నివాస గృహాల విభాగంలో పెట్టుబడులు మొదటి ఆరు నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. ప్రధానంగా దేశీయ పెట్టుబడులు ఈ వృద్ధికి మద్దతుగా ఉన్నాయి. పెరుగుతున్న వినియోగంతో స్థిరమైన వృద్ధికి అవకాశాలు ఉండడంతో పారిశ్రామిక ఆస్తుల విభాగం రెండున్నర రెట్లు అధికంగా పెట్టుబడులను ఆకర్షించింది.
తయారీ రంగం నుంచి డిమాండ్
‘‘తయారీ రంగం వేగంగా వృద్ధిని చూస్తోంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలు, తయారీ రంగంలో బలమైన వృద్ధితో ఈ రంగం ఇక ముందూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’అని నివేదిక వెల్లడించింది. డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, సీనియర్ హౌసింగ్ హాలీడ్ హోమ్స్, స్టూడెంట్ హౌసింగ్ తదితర ప్రత్యామ్నాయ ఆస్తుల విభాగంలో పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 60 శాతం క్షీణించి 158 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన పెట్టుబడులు 399 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. భారత రియల్ ఎస్టేట్ విభాగంలోకి సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 43 శాతం పెరిగి 3.7 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.57 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించొచ్చు. ఈ 3.7 బిలియన్ డాలర్లలో, అత్యధికంగా కార్యాలయ ఆస్తుల విభాగం 2.7 బిలియన్ డాలర్లు ఆకర్షించింది. మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల్లోకి సంస్థాగత పెట్టుబడులు 95 శాతం తగ్గి 15.1 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక రిటైల్ రియల్ ఎస్టేట్ ఆస్తుల విభాగం గతేడాది తొలి ఆరు నెలల్లో 492 మిలియన్ డాలర్లు రాబట్టగా, ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో ఎలాంటి పెట్టుబడులు రాలేదు. రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2018లో 5.7 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2019లో 6.3 బిలియన్ డాలర్లు, 2020లో 4.8 బిలియన్ డాలర్లు, 2021లో 4 బిలియన్ డాలర్లు, 2022లో 4.9 బిలియన్ డాలర్ల చొప్పున వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment