కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఒక్క చోట చేరి సంతోషంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళి. సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి పూజ ఈ వేడుకల్లో కీలకమైనది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా, సంపదను సాధించాలన్నా మనం కూడా కష్టపడి పనిచేయాలి. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. లక్ష్మీ దేవి పూజలో ఉపయోగించే దీపాలు, పూలు, నగదు మొదలైన వాటిని ఒకసారి పరిశీలిస్తే మన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ప్రేరణనిచ్చే అంశాలెన్నింటినో తెలుసుకోవచ్చు. వివిధ పూజాద్రవ్యాల సమాహారంలాగా ఈక్విటీ, డెట్, గోల్డ్ మొదలైన వాటితో కూడు కున్న మల్టీ అసెట్ ఫండ్ అనేది మెరుగైన రాబడులను పొందడంలో ఇన్వెస్టర్లకు ఎంతగానో తోడ్పడుతుంది.
దీపాలు: ఈక్విటీల కాంతులు
చీకటిని పారద్రోలి, ఆశల కాంతులనిస్తాయి దీపాలు. మొత్తం పూజా కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించేలా వెలుగు పంచుతాయి. మల్టీ–అసెట్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈక్విటీ పెట్టుబడులు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. సాధారణంగా పోర్ట్‌ఫోలియోకు వృద్ధి చోదకాలుగా ఈక్విటీలు పనిచేస్తాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడతాయి. దీపాలు ఏ విధంగానైతే గదిని కాంతివంతం చేస్తాయో దీర్ఘకాలంలో అధిక రాబడులను అందించి వృద్ధి దిశగా సాగే బాటను ప్రకాశింపచేస్తాయి ఈక్విటీలు. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వీటితో కొన్ని రిస్కులు ఉన్నప్పటికీ సంపద సృష్టి విషయంలో వీటికున్న సామర్థ్యాల కారణంగా సమతుల్యమైన పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా చోటు కల్పించాల్సిన ఆర్థిక సాధనంగా ఈక్విటీలు ఉంటాయి.
పుష్పాలు: డెట్ సాధనాల సౌరభాలు
లక్ష్మీ పూజలో స్వచ్ఛత, అందానికి చిహ్నమైన పుష్పాలు కూడా కీలకమే. పరిమళాలు వెదజల్లే పుష్పాలు పూజా కార్యక్రమానికి ఒకవైపు రంగుల హంగులను జోడిస్తూ మరోవైపు ఆధ్యాత్మిక శోభను తెస్తాయి. మల్టీ అసెట్ ఫండ్‌లో బాండ్లు, డిబెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీల్లాంటి డెట్ సాధనాలు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. మల్టీ అసెట్ ఫండ్‌లో డెట్ సాధనాలు స్థిరత్వాన్ని, క్రమానుగత ఆదాయాన్ని అందిస్తాయి. ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనైనా పోర్ట్‌ఫోలియో తీవ్ర ఒడిదుడుకులకు లోను కాకుండా సమతూకంగా ఉండేలా డెట్ సాధనాలు కాస్త బఫర్‌గా పనిచేస్తాయి. ఇవి మరో అంచె భద్రతను కల్పిస్తాయి. మార్కెట్ అనిశ్చితిని అధిగమించే ధీమాను అందిస్తాయి.
తిలకం: రక్షణ కవచం
నుదుటిపైన బొట్టు/తిలకం శుభాన్ని, రక్షణను సూచిస్తుంది. ప్రతికూల శక్తుల నుంచి భక్తులకు ఇది రక్షణ కల్పిస్తుంది. మల్టీ–అసెట్ ఫండ్‌లో ఈ పాత్రను పసిడి పోషిస్తుంది. సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పతనాలకు హెడ్జింగ్‌గా ఉపయోగపడే సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. రక్షణ కల్పించే తిలకంలాగే బంగారం కూడా ఆర్థిక సంక్షోభాల సమయంలో మీ పోర్ట్‌ఫోలియోను సురక్షితంగా ఉంచుతుంది. తమ సంపదను కాపాడుకోవాలనుకునే ఇన్వెస్టర్లు .. కాలం గడిచినా విలువను కోల్పోని బంగారాన్ని తమ పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా చేర్చుకోతగిన సాధనం కాగలదు. ఇటీవలి కాలంలో చూస్తే బంగారం కూడా గణనీయంగా రాబడులు అందించింది. వివిధ అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పసిడికి డిమాండ్ మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.
నాణేలు/డబ్బు: నగదు తత్సమానాలు
నాణేలు, నోట్ల రూపంలో సంపద, సమృద్ధి, శ్రేయస్సు, ఆర్థిక సమృద్ధిని సూచించే నగదుకు కూడా లక్ష్మీ పూజలో ప్రాధాన్యం ఉంటుంది. లక్ష్మీ దేవి ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని, ఆశీర్వదిస్తుందని నమ్మకం. ఇన్వెస్టింగ్ ప్రపంచంలో టీఆర్‌ఈపీఎస్ (ట్రెజరీ బిల్స్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్), ట్రెజరీ బిల్లుల్లాంటివి నగదు తత్సమానమైనవి. ఇవి పోర్ట్‌ఫోలియోలో అంతర్గతంగా భద్రతా కవచంగా ఉపయోగపడతాయి. మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు స్థిరత్వాన్ని ఇస్తాయి. వివిధ పూజాద్రవ్యాలతో లక్ష్మీ పూజ ఎలాగైతే సంపూర్ణమవుతుందో వివిధ సాధనాలను తగు పాళ్లలో జోడించుకుంటే పోర్ట్‌ఫోలియో కూడా సంపూర్ణంగా, సమతూకంగా ఉంటుంది. ఈక్విటీ, డెట్, బంగారం, నగదు మేళవింపుగా ఉండే మల్టీ అసెట్ ఫండ్స్ అటువంటి ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు కల్పిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment