భారత దేశంలో ఎక్కువ మంది వయస్సు, ఆదాయంతో సంబంధం లేకుండా వివిధ కారణాల వల్ల బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కొంతమంది దీనిని పెట్టుబడి ప్రయోజనాల కోసం కొనుగోలు చేస్తుండగా, మరి కొందరు పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను ధరించడం అనేది భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. చాలా మంది ప్రజలు తమ చేతిలో డబ్బు ఉన్నప్పుడల్లా విలువైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఏవైనా అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చని వారి ఉద్దేశ్యం.
కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను తెచ్చుకున్నారు. అందుకే అలంకరణ కోసమే కాకుండా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కోసం కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇలా ఎంత పడితే అంత మన దేశంలో బంగారం కొనుగోలు చేయవచ్చా? చట్టబద్దంగా ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండాలి? ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు చాలా మందికి సమాధానం తెలియదు. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 132 భారత పన్ను అధికారులకు తనిఖీ సమయంలో ఏవైనా ఆధారాలు లేని ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దొరికితే స్వాధీనం చేసుకునే అధికారం వారికీ ఉంటుంది. ఒక వ్యక్తి ఇంతే బంగారం కలిగి ఉండాలనే అనే ప్రత్యేక నిబంధన లేదు. కానీ, మీ దగ్గర ఉన్న బంగారానికి సరైన ఆధారాలు చూపిస్తే ఎటువంటి సమస్య లేదు. లేకపోతె వాటిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ‘‘ఆదాయపు పన్ను అధికారులు తనిఖీ నిర్వహించే సమయంలో మీ ఇంట్లో ఉన్న బంగారానికి కొనుగోలు/ఎక్స్ఛేంజ్ ఇన్వాయిస్‌లు చూపించాలి. ఒకవేళ మీకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆభరణాలైతే బహుమతి దస్తావేజులను చూపించాల్సి ఉంటుంది. వారసత్వ బంగారానికి 1994 మే 11 నాటి సిబిడిటి చట్టంలోని సూచన నెం.1916 రక్షణగా నిలుస్తుంది. లెక్కలో చూపని బంగారాన్ని జప్తు చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఉంటుంది.” అని డెలాయిట్ ఇండియా భాగస్వామి సుధాకర్ సేతురామన్ చెప్పారు.
అలాగే, మీ దగ్గర భారత ప్రభుత్వం నిర్దేశించిన దాని కన్నా తక్కువ ఉన్న బంగారానికి ఆధారాలు లేకున్న ఎటువంటి సమస్య లేదు. పరిమితికి లోబడి ఉండే బంగారాన్ని స్వాధీనం చేసుకోమని గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వివాహిత మహిళలు 500 గ్రాముల బంగారం, పెళ్లికాని మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారాన్ని కలిగి ఉండవచ్చు. వీటిని కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలు వంటి వివిధ కారణాలతో స్వాధీనం చేసుకోకూడదని చట్టం చెబుతోంది. ఈ పరిమితికి మించి మీ వద్ద లెక్కల్లో చూపని బంగారు ఆభరాణాలుంటే, వాటిని జప్తు చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment