బంగారంపైనా కన్ను!
- బంగారం, నగల నిల్వలపై పరిమితులు విధించిన ప్రభుత్వం
- వివాహితకు 500 గ్రాములు, పెళ్లికాని యువతికి 250 గ్రా., పురుషుడికి 100 గ్రాములే అనుమతి
- అంతవరకూ లెక్కచెప్పక పోయినా పర్లేదు
- ఆ పరిమితి దాటితే లెక్కలు చూపాల్సిందే..
- వారసత్వ బంగారం, వ్యవసాయ ఆదాయంతో కొన్న బంగారం ఎంతైనా ఉండొచ్చు
- లెక్కచెప్పిన బంగారానికి పరిమితి లేదు
- చట్టబద్ధమైన ఆదాయ మార్గాలను వెల్లడించి ఎంత మొత్తంగానైనా బంగారం, ఆభరణాలను కలిగి ఉండొచ్చు. అలాగే, వారసత్వంగా వచ్చిన బంగారం, ఆభరణాలపై పరిమితులు లేవు. వాటిని జప్తు చేయడం జరగదు.
- వివాహిత వద్ద 500 గ్రా., పెళ్లికాని యువతి వద్ద 250 గ్రా., పురుషుల వద్ద 100 గ్రాముల వరకు బంగారం ఉండొచ్చు. వాటి విలువ వారి ఆదాయంతో సరిపోలక పోరుునా.. వాటికి సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు అడగరు. వాటిని స్వాధీనం చేసుకోరు.
- వ్యవసాయ ఆదాయం, పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్న బంగారంపై పరిమితి లేదు.
- ఐటీ చట్టానికి తాజాగా చేసిన సవరణల్లో ప్రతిపాదించిన 85% పన్ను చట్టబద్ధ ఆదాయంతో సమకూర్చుకున్న బంగారం, ఆభరణాల నిల్వలకు వర్తించదు.
- కుటుంబ విలువలు, సంప్రదాయాలు.. తదితర అంశాలకు సంబంధించి పెద్ద మొత్తంలో బంగారం, ఆభరాణాలు ఉన్నా.. వాటిని సీజ్ చేయకూడదని ఐటీ శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
న్యూఢిల్లీ
పెద్ద నోట్ల రద్దుతో అక్రమార్కుల నల్లధనం నిల్వలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ సర్కారు.. తాజాగా మహిళల నగల పెట్టెపై దృష్టి పెట్టింది. నోట్ల రద్దు అనంతరం పెద్దమొత్తంలో నల్లధనాన్ని బంగారం, ఆభరణాల కొనుగోలుకు వినియోగించారన్న వార్తల నేపథ్యంలో.. బంగారం, ఆభరణాల వ్యక్తిగత నిల్వలపై పరిమితులు విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మహిళలు సహా అన్ని వర్గాల్లో ఆందోళనలు వెల్లువెత్తడంతో.. ఆ నిబంధనలపై వివరణ ఇచ్చింది. బంగారం, ఆభరణాలకు సంబంధించి ప్రభుత్వ ప్రకటన, ఆ తరువాతి వివరణల్లోని ముఖ్యాంశాలివీ..
ఐటీ చట్ట సవరణలు బంగారానికి వర్తించవు: కేంద్రం
నల్లధనం అనంతరం బంగారంపై కేంద్రం కొరడా ఝలిపించనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్థిక శాఖ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని తాజా సవరణల్లో..లెక్కచూపని ఆదాయం తనిఖీల్లో పట్టుబడితే 85 శాతం వరకూ గరిష్టంగా పన్ను విధించే అవకాశం కల్పించారు. అరుుతే చట్టబద్ధంగా లెక్కచూపే బంగారానికి ఈ సవరణ వర్తించదని, వారసత్వంగా వచ్చిన బంగారం, వ్యవసాయ ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారానికి లెక్కచూపాల్సిన అవసరం లేదని, వాటికి ఎలాంటి పరిమితి ఉండదంటూ గురువారం ఉదయం మొదటి ప్రకటన చేసింది. వారసత్వంగా వచ్చిన బంగారం, ఆభరణాలకు... వెల్లడించిన ఆదాయం, వ్యవసాయ ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారానికి ఐటీ చట్ట సవరణలు వర్తించవు’ అని అందులో పేర్కొంది. ఈ ప్రకటనలో సరైన స్పష్టత లేకపోవడం, దాంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ వెంటనే మరో ప్రకటన విడుదల చేసింది.
చట్టబద్ధ ఆదాయ మార్గాల వివరాలు చెపితే ఒక వ్యక్తి ఎంతైనా బంగారం కలిగి ఉండొచ్చని అందులో పేర్కొంది. ‘వ్యక్తి ఆదాయ వివరాలు... అతని వద్ద ఉన్న బంగారం లెక్కకు సరిపోకపోరుునా...అందుకు ప్రాధమిక ఆధారాలు ఉన్నా ఒక పరిమితి వరకూ ఎలాంటి చర్యా ఉండదు. చట్టబద్ధంగా ఎంత బంగారం ఉన్నా అది పూర్తిగా భద్రమే’ అంటూ రెండో ప్రకటనలో మరింత స్పష్టత నిచ్చారు. ఐటీ శాఖ అధికారుల దాడుల సమయంలో ఎక్కువ బంగారం కలిగి ఉన్నా కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకుని వాటిని సీజ్ చేయకుండా విచక్షణాధికారం చూపాలంటూ ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఆభరణాలపై పన్ను అంశం బిల్లులో లేదు: సీబీడీటీ
ఐటీ చట్టం సవరణలు బంగారు ఆభరణాలకు కూడా వర్తిస్తాయన్న పుకార్ల నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆభరణాలపై పన్నుకు సంబంధించి బిల్లులో కేంద్రం ఎలాంటి నిబంధనలు పెట్టలేదని స్పష్టం చేసింది. ‘వెల్లడించిన ఆదాయం లేదా వ్యవసాయ ఆదాయం లేదా ఇంట్లో పొదుపు చేసి కొన్నవి, వారసత్వంగా వచ్చిన బంగారం, ఆభరణాలపై ప్రస్తుత నిబంధనల ప్రకారం లేదా సవరించిన నిబంధనల ప్రకారం ఎలాంటి పన్ను ఉండదు’ అని సీబీడీటీ స్పష్టం చేసింది.
ఐటీ చట్ట (రెండో సవరణ) బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలపగా... రాజ్యసభ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ బిల్లు ప్రకారం.. నల్లధనం వెల్లడించకపోతే 60 శాతం పన్ను, ఆ పన్నుపై 25 శాతం సర్‌చార్జ్, అదనంగా మరో 10 శాతం.. అంటే మొత్తంగా 85 శాతం వరకు గరిష్టంగా వసూలు చేసే అవకాశముంది. అలాగే, ముందే వెల్లడిస్తే.. 50% పన్ను చెల్లిస్తే సరిపోతుంది.