న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత దాఖలైన సవరించిన ఐటీ రిటర్నులను(రివైజ్డ్ ఐటీఆర్) మరింత నిశితంగా పరిశీలించాలని ఆదాయపు పన్ను అధికారులకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఆయా రిటర్నుల్లో నల్లధనం గనుక గుర్తించడం లేదా వివరాలను తారుమారు చేసినట్లు తేలితే పన్ను రేటును భారీగా పెంచి వసూలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 24న ఐటీ శాఖలోని ప్రాంతీయ ప్రధాన అధికారులందరికీ సీబీడీటీ తగిన సూచనలతో కూడిన రెండు పేజీల లేఖను పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
‘నోట్ల రద్దు తర్వాత దాఖలైన రివైజ్డ్ రిటర్నులలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనుమానాలు ఉంటే వాటిపై కచ్చితంగా మరింత నిశిత పరిశీలన అవసరం. అటువంటి కేసుల్లో లెక్కల్లో చూపని ఆదాయాలేవైనా బయటపడితే.. ఐటీ చట్టంలోని సెక్షన్ 115బీబీఈ ప్రకారం అధిక పన్ను రేటును విధించి వసూలు చేయాలి’ అని సీబీడీటీ స్పష్టం చేసింది. కాగా, వ్యాపార వర్గానికి చెందిన పన్ను చెల్లింపుదారులు గనుక అమ్మకాలను పెంచి చూపినట్లు అనుమానాలు ఉంటే.. సెంట్రల్ ఎక్సైజ్/వ్యాట్ రిటర్నులతో పోల్చిచూడాలని కూడా ఐటీ అధికారులను ఆదేశించింది.
చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా...
‘చట్టప్రకారం సవరించిన లేదా ఆలస్యంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు.. డీమోనిటైజేషన్ తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిచూపేందుకు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి అడ్డుకట్టవేయడమే సీబీడీటీ తాజా ఆదేశాల ముఖ్య ఉద్దేశం. నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద ఆర్థిక లావాదేవావీల ఆధారంగా ఇప్పటికే ఐటీ శాఖ 20 వేలకు పైగా కేసులను నిశిత పరిశీలనకోసం గుర్తించింది. ఇప్పుడు కొత్త ఆదేశాల ఆధారంగా వీటిపై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు’ అని సీనియర్ ఐటీ అధికారి ఒకరు వివరించారు.
ఐటీ రిటర్నుల్లో సవరణ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే(ఆదాయాన్ని మార్చి చూపడం వంటివి) జరిమానాతోపాటు చట్టపరమైన కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే సీబీడీటీ అసెస్సీ(పన్ను చెల్లింపుదారులు)లను తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం అసెస్సీలు అసలు రిటర్నుల్లో తప్పులేవైనా ఉంటే సరిదిద్దడానికి, అనవసరమైన అంశాల తొలగింపునకు మాత్రమే రివైజ్డ్ ఐటీఆర్‌లను దాఖలు చేసేందుకు వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment