సాక్షి,ముంబై: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారు భారత్. మన దేశంలో బంగారం అంటే సెంటిమెంట్ మాత్రమే కాదు పెట్టబడికి ఒక కీలకమైన మార్గం కూడా. బంగారాన్ని లక్ష్మీ దేవితో సమానంగా భావిస్తారు. పసిడి ఇంట్లో శుభప్రదమని నమ్ముతారు. అందుకే ఆభరణాల నుండి నాణేల వరకు ఇళ్లలో బంగారాన్ని దాచుకోవడానికి ఇష్టపడతారు.
అయితే బంగారాన్ని ఇట్లో ఎంతమేరకు ఇంట్లో ఉంచుకోవాలి. అసలు దానికి సంబంధించిన ఏమైనా ఆంక్షలున్నాయా? చట్టప్రకారం ఇంటిలో ఎంత బంగారాన్ని దాచుకోవచ్చు? దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఏం చెబుతోంది? అనేది పరిశీలించడం చాలా అవసరం.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం, ఒక వ్యక్తి వెల్లడించిన ఆదాయంతో బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా పొదుపు చేసిన మొత్తంతో కొనుగోలు చేసినా లేదా చట్టబద్ధంగా వారసత్వంగా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారానికి పన్ను వర్తించదు. ఈ విధంగా కొనుగోలు చేసిన బంగారాన్ని సెర్చ్ ఆపరేషన్ల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకోలేరు.
నిబంధనల మేరకు దాచుకున్న బంగారంపై ఎలాంటి పన్ను వర్తించనప్పటికీ, కానీ దానిని విక్రయించే సమయంలో మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చట్ప్రకారం వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని, అవివాహిత మహిళ 250 గ్రాముల బంగారాన్ని, కుటుంబంలోని పురుషులకు పరిమితి 100 గ్రాములు మాత్రమే.
మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బంగారం మన దగ్గర ఉంచుకుని తర్వాత దానిని విక్రయించాలనుకుంటే ఆ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం.. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ (ఎల్టీసీజీ)కి లోబడి ఉంటుంది, ఇది ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం. బంగారాన్ని కొనుగోలు చేసిన మూడేళ్లలోపు విక్రయిస్తే, ఆ లాభం వ్యక్తి ఆదాయానికి కలిపి, పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.
సావరిన్ గోల్డ్ బాండ్లను (SGB) విక్రయించిన సందర్భంలో కూడా లాభాలు మీ ఆదాయంగా లెక్కించి, పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.మూడు సంవత్సరాల తర్వాత విక్రయిస్తే, లాభాలపై ఇండెక్సేషన్‌తో 20 శాతం, ఇండెక్సేషన్ లేకుండా 10 శాతం చొప్పున పన్ను విధిస్తారు. అయితే మెచ్యూరిటీ వరకు బాండ్‌ని ఉంచితే వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment