తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. పరిమితికి మించి తీసుకెళితే ఎలాంటి పత్రాలను చూపించాలనే దానిపై స్పష్టత కావాలని ఎన్నికల అధికారిని కోరిన ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాభై వేలకు పైగా డబ్బు తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి రుజువు పత్రాలు ఉండాలో తెలపాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ).. ఎన్నికల అధికారిని కోరింది. బంగారం ఎంత పరిమితిలో తీసుకెళ్లాలో వివరించాలని, దానికి ఎలాంటి ఆధార పత్రాలుండాలో తెలపాలని పేర్కొంది.
ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం పట్టుకున్న బంగారం, డబ్బును కమిటీతో విచారించి 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజలు, వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వైన్‌షాపుల యాజమానులు డబ్బులను డిపాజిట్ చేసే క్రమంలో పట్టుకుంటున్నారని వెల్లడించారు.
పండగలు, పెళ్ళిళ్ళ సీజన్‌లో నగదును తీసుకెళ్తారని, వంశపారంపర్యంగా వచ్చిన ఆభరణాలకు రశీదులుండవని పద్మనాభరెడ్డి అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిబంధనల పేరుతో ప్రజలను, వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని, వీటిపై పోలీసులు, కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు, సలహాలివ్వాలని తెలిపారు. నేరస్తులను పట్టుకోవాలని, అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని సీఈవోను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment