పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. దీన్ని తరాలు గుర్తిండిపోయేలా వైభవంగా జరపాలనుకుంటారు. పెళ్లి బట్టల షాపింగ్ నుంచి వధువు అత్తారింట్లో కాలుమోపే వరకు రూ.లక్షలు ఖర్చు చేస్తారు. మొన్నామధ్య అనంత్ అంబానీ పెళ్లికి ముఖేశ్ అంబానీ కుంటుంబం కోట్లల్లో ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయి. పెళ్లిలో ఎలాంటి అవాంతరం జరగకుండా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఆస్తి నష్టం కలిగి, బంధువులు గాయాలపాలైతే..పెళ్లి చేస్తున్న కుటుంబ సభ్యులకు తీరని వ్యథగా మారుతుంది. అలాంటి వారికోసం చాలా బీమా కంపెనీలు వివాహ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినా ఈ బీమా ఆర్థికంగా ఆదుకుంటుంది.
వివాహ వేడుక స్థాయి, సర్వీసులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సర్వీసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది.
లయబిలిటీ కవరేజీ..పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటిది జరిగితే ఈ కవరేజీ వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ థర్డ్ పార్టీకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు.
ఏదైనా కారణాల వల్ల పెళ్లి రద్దైనా లేదా వాయిదా పడినా క్యాన్స్‌లేషన్ కవరేజీ ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. విలువైన వస్తువులు పాడైనా దాని కోసం ప్రత్యేకంగా కవరేజీ అందిస్తున్నారు. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి.
ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్‌లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా.. ‘అటైర్ కవరేజీ’ రైడర్‌లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment