న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్ మోటార్ ఇండియా తీపికబురు అందించింది. వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్ధమైంది. 2028 నాటికి ఆర డజనుకు పైగా ఎలక్ట్రిక్ మోడళ్లను రంగంలోకి దింపనుంది. వీటిలో ఒకటి వచ్చే ఏడాది ఇక్కడి రోడ్లపై పరుగుతీయనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల ఆధారంగా, అలాగే అంతర్జాతీయంగా కంపెనీ అమలు చేస్తున్న ఈ-జీఎంపీ ప్లాట్‌ఫాంపైనా కొన్ని మోడళ్లను తయారు చేయనుంది. 77.4 కిలోవాట్ అవర్ వరకు సామర్థ్యం గల బ్యాటరీ పొందుపరిచే వీలుంది. 2, 4 వీల్ డ్రైవ్‌తోపాటు గంటకు 260 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి.
ఈ వాహనాల అభివృద్ధి, పరిశోధన కోసం రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఎస్.ఎస్.కిమ్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి చెన్నై ప్లాంటులో చేపడతామని, బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. భారత్‌లో కంపెనీ ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్‌ను విక్రయిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఈవీ అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉన్న టాటా మోటార్స్, 2030 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. స్థానిక ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో హ్యుందాయ్ 16-17% వాటాను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment