సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటితో పోరాడుతున్న వారికి కావాల్సింది మద్దతు. అంతేకాని జాలి కాదు. బాధల్లో ఉన్నవాళ్లు చెడ్డవాళ్లు కాదు. వాళ్లను చూడగానే మీ ముఖ కవళికలు మార్చాల్సిన అవసరం లేదంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరు క్షణమే అతన్ని మెచ్చకుంటూ తమ కంపెనీలో ఉద్యోగం చేయాలంటూ అనేక మంది సీఈవోలు ఆఫర్లు ఇస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తికి ఉన్న సమస్య ఏంటీ అతను ఎందుకలా స్పందించాడు?
ఝార్ఖండ్‌కి చెందిన ఆర్ష్ నందన్ ప్రసాద్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా భయంకరమైన నిజం బయటపడింది. అతని ఒంట్లోకి ప్రవేశించిన క్యాన్సర్ వ్యాధి క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మొదలెట్టింది. దీంతో ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు జూమ్‌లో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు.
ఇంటర్వ్యూలో అవతలి వ్యక్తులు అడుగుతున్న ప్రశ్నలకు ఆర్ష్ నందన్ సరైన సమాధానలు ఇస్తూనే ఉన్నాడు. అయితే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులకు అతనిచ్చే సమాధానాల కంటే అతని ఆరోగ్య పరిస్థితిపైనే ఎక్కువ కన్‌సర్న్ చూపిండం ఆర్ష్ నందన్ ప్రసాద్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టింది. జాబ్ ఇవ్వడం మాట అటుంచి... ఆస్పత్రి బెడ్‌పై ఉన్న అతన్ని చూడగానే ముఖకవళికలు మార్చడం, జాలిగా మాట్లాడటం. అతని నైపుణ్యాలు, సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేయడం ఎక్కువైంది.
ఓవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్‌కి ఇంటర్వ్యూయర్ల ప్రవర్తన మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టింది. కీమో థెరపీతో క్యాన్సర్‌తో పోరాడే సమయంలో వీళ్ల ప్రవర్తన తనకు ఇబ్బందిగా ఉంటోందని పేర్కొటూ లింక్‌డ్ ఇన్‌లో మేసేజ్ పెట్టాడు. అందులో నా స్కిల్స్, సామర్థ్యం చూడండి అంతే కానీ నాకున్న వ్యాధిని చూసి జాలి పడొద్దు. నాకు కావాల్సింది అది కాదంటూ పేర్కొన్నాడు.
ఆర్ష్ నందన్ ప్రసాద్ లింక్డ్‌ఇన్ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్రకు చెందిన అప్లైడ్ కంప్యూటింగ్ సంస్థ సీఈవో నీలేశ్ సప్తూర్ స్పందించాడు. క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న నువ్వు ఒక యోధుడివి. ఇకపై ఇంటరర్వ్యూలు ఇవ్వడం ఆపేయ్. నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టు. ట్రీట్‌మెంట్ తీసుకో. నీ క్రెడెన్షియల్స్ నేను చూశాను. అన్నింటా సూపర్‌గా ఉన్నావ్. నీలాంటి యోధుడికి మా కంపెనీలో ఎప్పుడూ ఉద్యోగం రెడీగా ఉంటుంది. నువ్వు కావాలనుకున్నప్పు వచ్చి జాయిన్ అవమంటూ ఆఫర్ ఇచ్చాడు.
విదేశాల నుంచి కూడా అనేక కంపెనీలకు చెందిన సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. నందన్ ప్రసాద్ మద్దతుగా అనేక మంది గళం విప్పారు. మొత్తానికి కార్పోరేట్ వరల్డ్ చేపట్టే ఇంటర్వ్యూలపై ప్రసాద్ సరికొత్త చర్చకు తెర తీశాడు.
చదవండి: మస్క్ చేతికి ట్విటర్.. సీఈవో పరాగ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment