పన్ను చెల్లింపుదారులు ఎగవేతలకు పాల్పడకుండా ఆదాయపు పన్ను శాఖ నూతన మార్గదర్శకాలతో పట్టు బిగించింది. ఐటీ శాఖ పంపించే నోటీసులను లైట్ తీసుకునేవారి పట్ల కఠిన వైఖరి అవలంభించనుంది. నోటీసులకు స్పందించనివారు పూర్తి స్క్రూటినీ ఎదుర్కోవలసి ఉంటుంది.
పన్ను ఎగవేత చర్యలను కట్టడి చేయడంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త చర్యలను చేపట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఐటీ నోటీసులకు స్పందించని పక్షంలో ఐటీ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. అంతేకాకుండా పన్ను ఎగవేతకు సంబంధించి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థల నుంచి సమాచారం అందినప్పుడు కూడా లోతుగా పరిశీలించనున్నట్లు సీబీడీటీ తెలిపింది.
ఆదాయంలో వ్యత్యాసాలను గుర్తించిన ఐటీ అధికారులు జూన్ 30లోగా ఐటీ చట్టం సెక్షన్ 143(2) కింద రెండో నోటీసు పంపుతారు. అలాగే సెక్షన్ 142 (1), 148 కింద నోటీసులు అందుకున్న వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఐటీ శాఖ పరిశీలిస్తుంది.
స్క్రూటినీకి మార్గదర్శకాలు
ఐటీ శాఖ పరిశీలనకు అనుసరించాల్సిన విధానాలను పేర్కొంటూ సీబీడీటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏవైనా చట్టబద్ధమైన సంస్థల నుంచి పన్ను ఎగవేతను సూచించే నిర్దిష్ట సమాచారం అందిన సందర్భంలో ఆ కేసులను ఐటీ శాఖ పరిశీలనకు తీసుకుంటుంది. ఆ పన్ను చెల్లింపుదారు సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌కు ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.
నోటీసుకు స్పందనగా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ, సెక్షన్ 148 కింద నోటీసులు అందుకున్న సందర్భంలోనూ ఐటీ శాఖ పరిశీలన చేపడుతుంది. పన్ను చెల్లింపుదారు సెక్షన్ 142 (1) కింద నోటీసుపై రిటర్న్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే ఐటీ శాఖ పరిశీలనలోకి వస్తుంది. రిటర్న్ దాఖలుకు సంబంధించి మరింత స్పష్టత కోసం ఆదాయపు పన్ను శాఖ ఈ సెక్షన్ 142(1) కింద నోటీసు జారీ చేస్తుంది.
2021 ఏప్రిల్ 1కి ముందు లేదా తర్వాత ఐటీ శాఖ సోదాలు చేసి సీజ్ చేసి ఉంటే అటువంటి వారు కూడా స్క్రూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెక్షన్ 12A, 12AB, 35(1)(ii)/(iia)/(iii), 1023(C) మొదలైన వాటి కింద ఐటీ శాఖ ఆమోదించకపోయినా పన్ను మినహాయింపు లేదా తగ్గింపును క్లెయిమ్ చేసిన వారిపై కూడా విచారణ ఉంటుంది.
ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా!
Comments
Please login to add a commentAdd a comment