న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2026–27 ఆర్థిక సంవత్సరం వరకూ సగటున 6.7 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ సీనియర్ ఎకనమిస్ట్ (ఆసియా–పసిఫిక్) విశ్రుత్ రాణా అంచనావేశారు. దేశీయ వినియోగమే ఎకానమీ పురోగతికి ప్రధాన కారణంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు. 2022–23లో ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతంకాగా, ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6 శాతంగా ఉంటుందని ఒక వెబినార్‌లో పేర్కొన్నారు.
ఎగుమతుల పరంగా ఎదురవుతున్న సవాళ్లు వృద్ధి రేటుకు కొంత ప్రతికూలంగా ఉన్నాయని అన్నారు. వడ్డీరేట్ల పెంపు, వినియోగ డిమాండ్‌పై ఈ ప్రతికూలతలు తక్షణం ఎకానమీ బలహీనతకు కారణంగా పేర్కొన్నారు. 2022–23 వృద్ధికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 6.5 అంచనాలకన్నా విశ్రుత్ రాణా అంచనా (6 శాతం) తక్కువగా ఉండడం గమనార్హం. కాగా పెట్టుబడుల పరంగా చూస్తే దేశీయ రికవరీ పటిష్టంగా ఉందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ, వడ్డీరేట్లను తగ్గించేందుకు ఆర్‌బీఐ తొందరపడబోదన్నది తమ అభిప్రాయమన్నారు. ద్రవ్యోల్బణం అంచనాలు పూర్తిగా తగ్గే వరకు ఆర్‌బీఐ నిరీక్షిస్తుందని, రేట్లను తగ్గించడానికి 2024 ప్రారంభం వరకు వేచి ఉండవచ్చని రాణా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment