న్యూఢిల్లీ: సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) తయారీలో ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం ఐడెమియా(IDEMIA) దేశీయ మార్కెట్‌పై ఫోకస్ చేసింది. తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానం అయిన ఎంబెడెడ్ సిమ్‌ల (ఈ-సిమ్) తయారీకి భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీకి చెందిన అన్ని ప్లాంట్లు ఏటా 30 కోట్ల ఈ-సిమ్‌లు ఉత్పత్తి చేయగలవు. ఇందులో నోయిడా కేంద్రం వాటా 6 కోట్ల యూనిట్లు. ఈ ఫెసిలిటీని ఈ-సిమ్‌ల తయారీలో భారీ ప్లాంటుగా నిలపాలన్నది సంస్థ లక్ష్యం. ఈ-సిమ్ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ సిమ్‌కు బదులు మొబైల్ ఫోన్‌లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్‌ను పొందుపరుస్తారు. కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలంటే సిమ్‌ను మార్చాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్‌తో మరో ఆపరేటర్‌కు సింపుల్‌గా మారవచ్చు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు స్థానిక సిమ్ వినియోగించే పని లేదు. వేరబుల్స్, వాచెస్ వంటి ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాల్లో ఈ-సిమ్ ద్వారా స్థలం ఆదా అవుతుంది.
రూ.1,780 కోట్ల పెట్టుబడి
పరిశోధన, అభవృద్ధికి భారత్‌లో సుమారు రూ.1,780 కోట్లు వెచ్చించనున్నట్టు ఐడెమియా ఇప్పటికే ప్రకటించింది. వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ‘ఈ-సిమ్‌ల తయారీలో అతిపెద్ద ప్లాంట్లలో ఒకటిగా భారత్ నిలవనుంది. దేశంలో ఐడెమియా మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తోంది. టెలికం రంగంలో ఇక్కడ కొన్నేళ్లుగా పాతుకుపోయిన కారణంగా వీటి తయారీకి భారత్‌ను ఎంచుకున్నాం’ అని ఐడెమియా ఇండియా రీజినల్ ప్రెసిడెంట్ మాథ్యూ ఫాక్స్‌టన్ తెలిపారు. కంపెనీ ఏటా 60 కోట్లకుపైగా సిమ్‌లను ఇక్కడ తయారు చేస్తోంది. సంస్థ అంతర్జాతీయంగా చేపడుతున్న ఉత్పత్తిలో ఇది 67 శాతం. భారత కస్టమర్లకు ఇప్పటి వరకు 100 కోట్లకుపైగా సిమ్‌లను అందించింది. దేశీయ సిమ్‌ల మార్కెట్లో ఐడెమియా వాటా 40 శాతంపైమాటే. ఆధార్ ప్రాజెక్టులో భాగంగా బయోమెట్రిక్ టెక్నాలజీని సైతం ఈ సంస్థ అందించింది.
భవిష్యత్ ఈ-సిమ్‌లదే..
ప్రస్తుతం భారత్‌లో సుమారు 10 లక్షల మంది వినియోగదార్లు ఈ-సిమ్‌ను వాడుతున్నారు. యాపిల్, శామ్‌సంగ్, గూగుల్, మోటరోలా స్మార్ట్‌ఫోన్లలో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. అయితే టెలికం కంపెనీలు ఈ-సిమ్‌లను పెద్దగా ప్రోత్సహించడం లేదు. వీటితో వినియోగదార్లు సులువుగా ఆపరేటర్లను మారుస్తారు కాబట్టే కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. రాబోయే కొన్నేళ్లలో 30 శాతం స్మార్ట్‌ఫోన్లు ఈ-సిమ్ ఆధారంగా రూపుదిద్దుకుంటాయని ఐడెమియా అంచనా వేస్తోంది. ఏటా ఈ మార్కెట్ 30 శాతం వృద్ధి నమోదు చేస్తుందని భావిస్తోంది. ఈ-సిమ్‌లకు యూఎస్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్ అతి పెద్ద మార్కెట్లు.
Comments
Please login to add a commentAdd a comment