చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ పాత తయారీ ప్లాంట్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తోంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ఆధునీకరణ ప్రణాళికలకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం పాత సిమెంట్ ప్లాంట్ల సామర్థ్యాలను మెరుగుపరచేందుకు పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు 15–18 నెలల్లో రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాల కార్యాచరణ రూపొందించినట్లు
వివరించారు.
భూముల మానిటైజేషన్
ఇండియా సిమెంట్స్ చేతిలో 26,000 ఎకరాల భూమి ఉన్నదని, ల్యాండ్ బ్యాంక్‌ను మానిటైజ్ చేయడం ద్వారా నిధులను సమీకరించనున్నట్లు శ్రీనివాసన్ తెలియజేశారు. పాత ప్లాంట్ల ఆధునీకరణపై సలహాలకు క్రుప్ పాలిసియస్, ఎఫ్‌ఎల్ స్మిత్‌ను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మల్కాపూర్, విష్ణుపురం ప్లాంట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభంకానున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తమిళానడులోని శంకరి, రాజస్తాన్‌లోని బన్సారాలోని ఆధునిక ప్లాంట్లను ఈ జాబితాలో చేర్చబోరని తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిలంకూర్, యర్రగుంట్ల, తమిళనాడులో శంకరనగర్, శంకరి, దలవాయ్‌లలోనూ కంపెనీకి సిమెంట్ తయారీ ప్లాంట్లున్నాయి. చెన్నై, మహారాష్ట్రలలో రెండు గ్రైండింగ్ యూనిట్లను సైతం కలిగి ఉంది. ఈ యూనిట్లు ఉమ్మడిగా మొత్తం 16 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్లాంట్లను రెండు దశాబ్దాల క్రితం సొంతం చేసుకుంది.
క్యూ3లో రూ. 133 కోట్ల నికర లాభం
ఇండియా సిమెంట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 133 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 16 కోట్లు మాత్రమే ఆర్జించింది. అనుబంధ సంస్థ స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రయివేట్(ఎస్‌ఎంపీఎల్) విక్రయం ద్వారా నమోదైన ఆర్జన లాభాలకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 10 శాతంపైగా వృద్ధితో రూ. 1,281 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 1,161 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,153 కోట్ల నుంచి రూ. 1,458 కోట్లకు పెరిగాయి. 2022 అక్టోబర్ 10న దాదాపు రూ. 477 కోట్లకు ఎస్‌ఎంపీఎల్ విక్రయాన్ని పూర్తి చేసింది.
ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 191 వద్ద ముగిసింది.
ఇండియా సిమెంట్స్ ఆధునీకరణ
Published Sat, Feb 4 2023 6:25 AM | Last Updated on Sat, Feb 4 2023 6:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment