ముంబై: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న పబ్లిక్ ఇష్యూల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ) మరింత బలపడనున్నట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ప్రైమరీ మార్కెట్‌లో జోష్ కారణంగా రానున్న మూడేళ్లలో దేశీ మార్కెట్ క్యాప్‌నకు 400 బిలియన్ డాలర్లు జమకానున్నట్లు తెలియజేసింది. దీంతో 2024కల్లా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా వేసింది. వెరసి ప్రపంచంలో అత్యధిక మార్కెట్ క్యాపిటటైజేషన్ కలిగిన దేశాలలో 5వ ర్యాంకుకు చేరే వీలున్నట్లు అభిప్రాయపడింది.
గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్‌లో నెలకొన్న బూమ్ నేపథ్యంలో తాజా అంచనాలను రూపొందించినట్లు యూఎస్ బ్రోకింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంనుంచీ చూస్తే పబ్లిక్ మార్కెట్ ద్వారా కంపెనీలు 10 బిలియన్ డాలర్లను సమీకరిస్తున్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత మూడేళ్లలోనే ఇది అత్యధికంకాగా.. రానున్న 12–24 నెలల్లోనూ ఇది కొనసాగనున్నట్లు అంచనా వేసింది.
యూనికార్న్‌ల దన్ను
నవ ఆర్థిక వ్యవస్థ నుంచి పుట్టుకొస్తున్న యూనికార్న్‌లు, ఐపీవోల ద్వారా లిస్టింగ్‌కు సిద్ధపడుతున్న కంపెనీలు మార్కెట్ క్యాప్ అంచనాలకు బలాన్నిచ్చినట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ఇటీవల బిలియన్ డాలర్ల విలువను అందుకోడం ద్వారా యూనికార్న్ హోదాను పొందుతున్న స్టార్టప్‌లలో స్పీడ్ నెలకొన్నదని తెలియజేసింది.
ఇంటర్నెట్ వృద్ధి, ప్రయివేట్ పెట్టుబడుల లభ్యత, నియంత్రణ సంస్థల తోడ్పాటు వంటి అంశాలు దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు దన్నునిస్తున్నట్లు వివరించింది. ఫలితంగా ఇటీవల 3.5 ట్రిలియన్ డాలర్లను అందుకున్న దేశీ మార్కెట్ క్యాప్ 2024కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. గత వారం ఫ్రాన్స్‌ను అధిగమిస్తూ దేశీ మార్కెట్ విలువ ప్రపంచంలో ఆరో ర్యాంకును అందుకున్న సంగతి తెలిసిందే.
డిజిటల్ జోరు
ప్రస్తుతం దేశీ ఈక్విటీ ఇండెక్సులలో పాతతరం ఆర్థిక రంగాలకు చెందిన కంపెనీలదే అధిపత్యమని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. 20 ఏళ్ల సగటు లిస్టింగ్ వయసు కారణంగా పురాతన సూచీలుగా నిలుస్తున్నట్లు వ్యాఖ్యానించింది. అయితే అతిపెద్ద డిజిటల్ ఐపీవోల ద్వారా కొత్త తరానికి చెందిన రంగాలకు ప్రాధాన్యత పెరగనున్నట్లు అంచనా వేసింది. దీంతో నవతరం ఆర్థిక, టెక్ రంగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడులు 5 శాతం నుంచి 12 శాతానికి(50 శాతం ఫ్లోట్) పెరగనున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ఇటీవల స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటో లిస్ట్‌కాగా.. ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎమ్‌సహా పలు ఇతర కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment