
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి జూన్‌లో 13.6 శాతంగా నమోదయ్యింది. లో బేస్ ఎఫెక్ట్‌కుతోడు తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల పనితీరు బాగుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 జూన్ నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్‌డౌన్ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 16.6 శాతం క్షీణత నమోదయ్యింది. సమీక్షా నెల– జూన్ గణాంకాల్లో ముఖ్యాంశాలు ఇవీ..
► మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వాటా కలిగిన తయారీ రంగం 13 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2020 జూన్‌లో ఈ విభాగం 17 శాతం క్షీణించింది.
► మైనింగ్ రంగం పురోగతి 23.1 శాతం. 2020 జూన్‌లో 19.6 శాతం క్షీణత నమోదయ్యింది.
► విద్యుత్ జూన్ ఉత్పత్తి 8.3 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే నెల్లో 10 శాతం క్షీణతలో ఉంది.
► భారీ పెట్టుబడులు, యంత్రసామాగ్రి ఉత్పత్తిని ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ రంగం 37.4 శాతం క్షీణత నుంచి 25.7 శాతం పురోగతికి మారింది.
► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల ఉత్పత్తికి సంబంధించి ఈ విభాగం సమీక్షా నెల్లో 30.1 శాతం లాభపడింది. 2020 ఇదే నెల్లో 4.5 శాతం క్షీణతలో ఉంది.
► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, కాస్మోటిక్స్ వంటి ఈ ఉత్పత్తుల 4.5 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. గత ఏడాది ఇదే నెల్లో ఈ విభాగంలో 6.9 శాతం వృద్ధి నెలకొంది.
2019 జూన్‌తో పోల్చితే తక్కువే..
2019 జూన్‌తో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి ఇంకా బలహీనంగా ఉంది. 2019 జూన్‌లో సూచీ 129.3 పాయింట్ల వద్ద ఉంటే, తాజా సమీక్షా నెల (2021 జూన్)లో 122.6 పాయింట్ల వద్ద ఉంది. 2020లో ఇది కేవలం 107.9 (16.6% క్షీణత). వార్షికంగా చూస్తే 2021 జూన్‌లో 13.6% వృద్ధి అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment