భారత్‌లో పరిశోధన కార్యకలాపాల విస్తరణ
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ భారత్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. కృత్రిమ మేథ (ఏఐ), జనరేటివ్ ఏఐ, నెట్‌వర్క్ ఏపీఐలు, 6జీ టెక్నాలజీ అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం గణనీయంగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ భారత విభాగం హెడ్ ఆండ్రెస్ విసెంటి ఈ విషయాలు తెలిపారు. 1994లో నుంచి భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తున్నామని, అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఇది కూడా ఒకటని వివరించారు.
5జీ సాంకేతికతను వినియోగంలోకి తేవడంలో భారత్ వేగంగా పనిచేసిందని ఆండ్రెస్ తెలిపారు. కేవలం 22 నెలల్లోనే అయిదు లక్షల పైగా బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా 90 శాతం మేర కవరేజీ సాధించిందని చెప్పారు. దీంతో నెట్‌వర్క్ పనితీరుకు సంబంధించి భారత్ 86వ స్థానం నుంచి 16వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. టెలికం దిగ్గజాలు భారతి ఎయిర్‌టెల్, జియోతో ఎరిక్సన్‌కి గతంలో ఒప్పందాలు ఉన్నాయి. ఇటీవలే 4జీ, 5జీ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌నకు సంబంధించి వొడాఫోన్ ఐడియాతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశీయంగా ఎరిక్సన్‌కి చెన్నై, బెంగళూరు, గురుగ్రామ్‌లో ఆర్‌అండ్‌డీ కేంద్రాలు ఉన్నాయి. టెలికం రంగంలో రవాణా, క్లౌడ్ తదితర విభాగాలకు సంబంధించిన సాంకేతికతలపై ఇవి పని చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment