న్యూఢిల్లీ: ప్రభుత్వం పని చేసే హక్కును తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందరికీ ఉపాధి కల్పించేందుకు వీలుగా జీడీపీలో ఏటా 5 శాతం చొప్పున (సుమారు రూ.13.52 లక్షల కోట్లను) కేటాయించాలని ఓ సంస్థ సూచించింది. దేశ్ బచావో అభియాన్ ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ కమిషన్ ఆన్ ఎంప్లాయిమెంట్, అన్‌ఎంప్లాయిమెంట్’ ఈ నివేదికను విడుదల చేసింది. ఏవో నామమాత్రపు నిధుల కేటాయింపులతో పూర్తి స్థాయి ఉపాధి కల్పన అసాధ్యమని అభిప్రాయపడింది.
చట్టంలోనూ, సామాజిక-రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ గణనీయమైన మార్పులు అవసరమని పేర్కొంది. దేశ పౌరులకు తగినంత ఉపాధి కల్పించేందుకు ‘రైట్ టు వర్క్’ చట్టాన్ని తేవాలని కోరింది. దేశంలో పనిచేసేందుకు 21.8 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారంటూ.. వీరికి ఉపాధి కల్పించేందుకు జీడీపీలో ఏటా 5 శాతం నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించింది. అలాగే, ఏటా ఒక శాతం చొప్పున ఐదేళ్లపాటు పెంచుతూ వెళ్లాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని పొందుతున్న వారిని ఈ గణాంకాల నుంచి మినహాయించింది. ఉపాధి కల్పన పెరిగితే అది పెద్ద ఎత్తున ఉత్పత్తికి దారితీస్తుందని, తద్వారా డిమాండ్ బలోపేతం అవుతుందని సూచించింది. ప్రస్తుతం దేశంలో 30.4 కోట్ల మందికే సరైన ఉపాధి ఉన్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment