దుబాయ్: భారత్ తదుపరి వృద్ధి కక్ష్యలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీ విజయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎక్‌పో2020 దుబై ఇండియా పెవిలియన్‌లో ఆయన మాట్లాడుతూ.. సొంతంగా వ్యాక్సిన్ తయారు చేయడం, విదేశాలకు ఎగుమతి, దేశంలో అంచనాలకు మించి వ్యాక్సినేషన్ వంటి అంశాలు భారత్ సామార్థ్యానికి ప్రతీకగా నిలిచే అంశాలని పేర్కొన్నారు.
దేశం శక్తిసామర్థ్యాల పట్ల, ఆర్థికాభివృద్ధి పట్ల సామాన్యుని విశ్వాస స్థాయిని ఆయా అంశాలు రెట్టింపుచేశాయని అన్నారు. ‘‘అత్యంత సవాలుగా ఉన్న సమయాలలో దేశం ఒకటిగా నిలిచింది. సవాళ్ల నుండి చాలా విజయవంతమైన పద్ధతిలో బయటపడింది. వృద్ధి పురోగతి, అవకాశాలు భారీగా ఉన్నాయని, పురోగమించడం భారత్‌కు సులభమన్న విశ్వాసాలు ఆయా పరిణామాలు దేశానికి ఇచ్చాయి. సామాన్యుల ఆకాంక్షలను తీర్చడంలో ఇది ఎంతో కీలకమైన అడుగని నేను భావిస్తున్నాను’’అని ఆయన అన్నారు.
రుణ వృద్ధిపై ఆశాభావం...
ఆర్థిక వ్యవస్థలో రుణ వృద్ధి దాదాపు రెండేళ్లుగా చాలా నెమ్మదిగా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొటూ, అయితే వినియోగం, రుణ వృద్ధి త్వరలో మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. దేశంలో పెరుగుతున్న వినియోగం, డిమాండ్ కార్పొరేట్ రంగంలో పెట్టుబడి డిమాండ్‌ను పునరుద్ధరించడంలో సహాయపడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలకు ఊతమివ్వడంలో భాగంగా మౌలిక సదుపాయాల పెట్టుబడులపై దృష్టి సారించడం ద్వారా ప్రభుత్వం అద్భుతమైన వ్యూహ రచన చేసింది. ఆయా అంశాలు కార్పొరేట్ రంగం పురోగతికి, దేశ వృద్ధిని తదుపరి కక్ష్యలోకి తీసుకుని వెళ్లడానికి దోహదపడతాయని విశ్వసిస్తున్నా’’ అని ఆయన అన్నారు. ఇండియా పెవిలియన్‌పై ఆయన మాట్లాడుతూ, ‘‘అవకాశాలతో నిండిన వాస్తవ భారతదేశాన్ని ప్రపంచం మొత్తానికి ఆకట్టుకునే రీతిలో ప్రదర్శిస్తున్నట్లు’’ అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment