భారతీయ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధికి తయారీ రంగం కీలకమని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా భారత్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థితికి చేరుకుంటుందని.. న్యూఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) 64వ సదస్సులో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
ఇప్పటికే భారత్ ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వేగంగా ముందుకు సాగుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఇండియా.. లిథియం అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేయగలదని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో, అల్యూమినియం, ఐరోనిక్ ఆయిల్, వివిధ రకాల రసాయన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇది దేశంలో మంచి మార్కెట్ అని గడ్కరీ అన్నారు.
కొన్ని కంపెనీలు ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీ తయారీలోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా భారత్ వీటిని ఎగుమతి చేయగలదు. కరోనా మహమ్మారి సమయంలో సెమికండక్టర్ల కొరత వల్ల ఆటోమొబైల్ రంగం కొంత డీలా పడింది. ఆ తరువాత మనదేశంలోని కంపెనీలు సెమికండక్టర్లను తయారు చేయడానికి పూనుకున్నాయి. మరో రెండేళ్లలో సెమీకండక్టర్ల తయారీలో మనమే నెంబర్‌వన్‌గా ఉంటామని గడ్కరీ అన్నారు.
దేశంలో ఈవీ మార్కెట్
ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో 2030 నాటికి కోటి యూనిట్ల వార్షిక విక్రయాలు సాధ్యమవుతుంది. ఇందులో ఐదు కోట్ల ఉద్యోగాలు రానున్నాయి. ఎగుమతులు కూడా పెరగాలని, దీనివైపుగా కంపెనీలు కృషి చేయాలని గడ్కరీ సూచించారు.
ఇదీ చదవండి: హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానం!.. నితిన్ గడ్కరీ
వాహన తయారీకి సంబంధించి మెరుగైన పరిశోధన, పరీక్షల కోసం టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం సీఐఐటీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రూ. 450 కోట్లతో పూణేలో ప్రారంభమవుతుంది. మరోవైపు స్క్రాపేజ్ విధానానికి కంపెనీలు సహకరించాలని ఆయన అన్నారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment