
వ్యవసాయ పరిశోధన అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలుంటాయని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (నాస్) ప్రెసిడెంట్ హిమాన్షు పాథక్ తెలిపారు. ప్రతి రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం లభిస్తుందన్నారు.
నాస్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..‘వ్యవసాయ పరిశోధన అభివృద్ధిలో పెట్టుబడులు లాభదాయకంగా మారనున్నాయి. ఆర్‌అండ్‌డీలో పెట్లే రూ.1 పెట్టుబడి సమీప భవిష్యత్తులో రూ.13 ప్రతిఫలం ఇస్తుంది. పశుసంవర్థక రంగంలో ఈ లాభాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. వ్యవసాయ పరిశోధనా వ్యవస్థను మరింత మెరుగుపర్చాలి. పంటసాగు వ్యయాలు పెరగడం, తక్కువ ఉత్పాదకత, వాతావరణ మార్పు ప్రభావం రూపంలో ఈ రంగానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. సహజ వనరుల క్షీణత, తెగులు, వ్యాధుల సమస్యలు పెరుగుతున్నాయి. వీటి పరిష్కారానికి ఎన్నో పరిశోధనలు జరగాలి. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలను తయారుచేయాలి. అందుకోసం టెక్నాలజీను వినియోగించాలి’ అన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) డైరెక్టర్ జనరల్‌గా కూడా హిమాన్షు పాథక్ పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: సినీ, క్రికెట్ ప్రముఖులతో ‘వంతారా’ ప్రచారం