PwC Report Says Indian Media And Entertainment Industry Reach A Valuation Of Rs. 4.30 Lakh Crore By 2026 - Sakshi
Sakshi News home page

రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా

Published Fri, Jun 24 2022 3:07 AM | Last Updated on Fri, Jun 24 2022 10:55 AM

Indian media and entertainment industry size to reach Rs 4. 30 lakh crore by 2026 - Sakshi

న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద పరిశ్రమ 2026 నాటికి 8.8 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందనుంది. రూ. 4.30 లక్షల కోట్లకు చేరనుంది. దేశీ మార్కెట్లో ఇంటర్నెట్, మొబైల్స్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ మీడియా, ప్రకటనలు ఇందుకు ఊతమివ్వనున్నాయి. సంప్రదాయ మీడియా నిలకడగా వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2026 నాటికి టీవీ అడ్వర్టైజింగ్‌ రూ.43,000 కోట్లకు చేరనుంది. తద్వారా అంతర్జాతీయంగా ఈ విషయంలో అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్‌ తర్వాత అతి పెద్ద టీవీ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌గా భారత్‌ అయిదో స్థానం దక్కించుకోనుంది. 2022లో భారతీయ మీడియా, వినోద పరిశ్రమ 11.4 శాతం వృద్ధితో రూ. 3.14 లక్షల కోట్లకు చేరనుంది.  

ఓటీటీలకు సబ్‌స్క్రిప్షన్‌ ఊతం ..
దేశీయంగా ఓటీటీ వీడియో సర్వీసులు వచ్చే నాలుగేళ్లలో రూ. 21,031 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇందులో రూ. 19,973 కోట్లు సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత సర్వీసుల నుండి, రూ. 1,058 కోట్లు వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీవోడీ) విభాగం నుండి రానున్నాయి. ఓటీటీల వృద్ధికి సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసులు ఊతమిస్తున్నాయని, 2021లో ఓటీటీల మొత్తం ఆదాయంలో వీటి వాటా 90.5 శాతంగా ఉండగా .. 2026 నాటికి 95 శాతానికి చేరుతుందని నివేదిక తెలిపింది. జనాభా పరిమాణం, మొబైల్‌ ఆధారిత ఇంటర్నెట్‌ వీడియోల వినియోగం.. ఓటీటీ మార్కెట్‌ వేగవంతంగా వృద్ధి చెందడానికి దోహదపడనున్నాయి.  

వార్తాపత్రికలు అప్‌..:
2021లో మొత్తం వార్తాపత్రికల ఆదాయం రూ. 26,378 కోట్లుగా ఉండగా, 2026 నాటికి 2.7 శాతం వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్‌) రూ. 29,945 కోట్లకు చేరనుంది. అప్పటికల్లా భారత న్యూస్‌పేపర్‌ మార్కెట్‌ .. ఫ్రాన్స్, బ్రిటన్‌ను కూడా దాటేసి అయిదో స్థానానికి ఎదుగుతుంది. ఈ వ్యవధిలో దినపత్రికల కాపీల విక్రయాల్లో (పరిమాణంపరంగా) వృద్ధి నమోదు చేసే ఏకైక దేశంగా భారత్‌ నిలవనుంది. ప్రింట్‌ ఎడిషన్‌ రీడర్‌షిప్‌లో 2025 నాటికి చైనాను దాటేసి అతి పెద్ద మార్కెట్‌గా నిలవనుంది.
 
నివేదికలో మరిన్ని విశేషాలు..

► 2022లో రూ.35,270 కోట్లుగా ఉండనున్న టీవీ ప్రకటనల విభాగం 2026 నాటికి 23.52% వృద్ధితో రూ. 43,568 కోట్లకు చేరనుంది.
► అనేక సంవత్సరాల పాటు వేగంగా వృద్ధి చెందిన భారతీయ టీవీ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌.. 2020లో కోవిడ్‌–19 కారణంగా మందగమనం బారిన పడింది. దీంతో 2019తో పోలిస్తే 2020లో 10.8% క్షీణించింది. ఇది తాత్కాలిక అవరోధమే. 2021లో ఈ విభాగం 16.9% వృద్ధి చెంది రూ. 32,374 కోట్లకు చేరింది.
► దేశీ ఇంటర్నెట్‌ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ 2026 నాటికి 12.1% వార్షిక వృద్ధితో రూ. 28,234 కోట్లకు చేరనుంది. మొబైల్స్‌ ద్వారా ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఇంటర్నెట్‌ ప్రకటనల మార్కెట్‌  ఆదాయంలో గతేడాది ఈ విభాగం వాటా 60.1%గా ఉండగా.. 2026 నాటికి 69.3 శాతానికి చేరనుంది.  
► వచ్చే నాలుగేళ్లలో వీడియో గేమ్స్, ఈ–స్పోర్ట్స్‌ విభాగం ఆదాయం 18.3 శాతం సీఏజీఆర్‌తో రూ. 37,535 కోట్లకు చేరవచ్చని అంచనా.
► దేశీ సినిమా పరిశ్రమ 2026 నాటికి రూ. 16,198 కోట్లకు చేరనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement